శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:47

ఒక్కలిఫ్టుతోనే రుద్రంగిలోకి నీళ్లు

ఒక్కలిఫ్టుతోనే రుద్రంగిలోకి నీళ్లు

  • ఎస్సారెస్పీ పునర్జీవంతో ఎల్లంపల్లికీ జీవం
  • వరదకాలువ కింద మరో 44వేల ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం మరోప్రాజెక్టు ఆయకట్టుకు సైతం జీవం పోయనున్నది. ఎల్లంపల్లి కింద ఉన్న 44వేల ఎకరాలకు సైతం వరదకాలువ ద్వారా సాగునీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఐదుదశల్లో లిఫ్ట్‌ చేయాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో ఒకేఒక్క లిఫ్టుతో పుష్కలంగా సాగునీరందనున్నది. ఉమ్మడిరాష్ట్రంలో రూపొందించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద నిర్దేశించిన ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. రెండు లక్షల ఎకరాల ఆయకట్టును నిర్దేశించగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపంతో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందడమే గగనంగా మారింది. 

కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే నీళ్లిస్తున్న ఆయకట్టు 50వేల ఎకరాలు కలిపి ప్రాజెక్టు కింద ఆయకట్టు లక్షా యాభైవేలకు చేరింది. అయితే ఇందులో 44 వేల ఎకరాలకు నీరివ్వాలంటే ఐదుదశల్లో లిఫ్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి వేమునూరు, మేడారం, గంగాధర, కొడిమ్యాలపై గ్రావిటీద్వారా జోగాపూర్‌.. అక్కడి నుంచి మరోదశలో లిఫ్టుచేసి రుద్రంగి చెరువులో నీళ్లు పోస్తే 44 వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. ఇలాకాకుండా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువ నుంచి కేవలం ఒక్కదశలో నీటిని లిఫ్టు చేయడం ద్వారా నేరుగా జలాలను రుద్రంగి చెరువుకు తరలించవచ్చు. పది కిలోమీటర్ల కాలువతోపాటు 75 మీటర్ల లిఫ్టు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. 

ఇందుకుగాను రుద్రంగి చెరువు నిల్వ సామర్థ్యం 0.15 టీఎంసీల నుంచి 0.45 టీఎంసీలకు పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇదేరీతిన లిఫ్టు పథకాన్ని చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించడంతో ఎల్లంపల్లి కింద మరో 44 వేల ఎకరాల ఆయకట్టు భారం తగ్గింది. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలకు మాత్రమే ఎల్లంపల్లి జలాలను పరిమితం చేసి.. మిగిలిన వాటికి ఇతరత్రా మార్గాల ద్వారా సాగునీరందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. వరద కాలువ కింద ఓటీల ద్వారా 139 చెరువులను నింపాలని ఆదేశించారు. దీంతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరద కాలువ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ సాగునీటిశాఖలో అన్ని వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ఈ నెల 15న కమిటీతో సమావేశాన్ని నిర్వహించి, తుదిరూపు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ వివరించినట్టు తెలిసింది. 

కేఎల్‌ఐ నీటివిడుదల ఎందుకు మొదలుకాలేదు?

కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని సీఎం కేసీఆర్‌ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. కృష్ణా బేసిన్‌లో వరద మొదలైన దరిమిలా వెంటనే నీటివిడుదల ప్రారంభించి.. చెరువులు నింపాలని సూచించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వెంటనే రూ.50 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ-21 కింద పైప్‌లైన్‌ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రాతిపదికన మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర ప్రాజెక్టును పరిశీలించి, ఇక్కడి పనులను బేరీజు వేయాలని రజత్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం.


logo