శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:43:08

తొలి అమరుడి కల..నెరవేరిన వేళ

తొలి అమరుడి కల..నెరవేరిన వేళ

  • శ్రీకాంతాచారి స్వగ్రామంలో అభివృద్ధి ఫలాలు   
  • ఇంటింటికీ భగీరథ జలాలు
  • సాగునీటి కోసం చెక్‌డ్యాం నిర్మాణం
  • నేడు గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ
  • డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ప్రారంభోత్సవం
  • గోస తీరిన గొల్లపల్లి.. ఆగిన వలసలు

2009 నవంబర్‌ 29 ఉద్యమనేత కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొన్న సందర్భం. సరిగ్గా అదేరోజు.. నేటి జనగామ జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లిలో విద్యార్థి శ్రీకాంతాచారి తన నానమ్మ గోవిందమ్మతో మనసులోమాటలు పంచుకొన్నాడు. ‘తెలంగాణ వస్తేనే ఊరు బాగుపడతది. పొలాలకు నీళ్లొస్తయి. భూములు పచ్చబడుతయ్‌.. తాగునీ టి కష్టాలు తీరుతయ్‌.. వలసలు ఆగిపోత య్‌' ఎన్నో ముచ్చట్లు చెప్పుకొంటూ వచ్చా డు. నాలుగురోజుల తర్వాత.. ఉద్యమం తీవ్రమై.. ఉస్మానియా మండుతున్నవేళ.. హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ చౌరాస్తాలో శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకున్నాడు. తెలంగా ణ అగ్నిగుండమైంది. ఫలితంగా ఐదేండ్లలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పుడతని కల సాకారమైంది. సాగునీటితో.. తాగునీటితో.. కళకళలాడే ఎవుసంతో ఆకుపచ్చని చీరకట్టుకొన్న గొల్లభామలా గొల్లపల్లి మెరిసిపోతున్నది. తెలంగాణ తొలి అమరుడికి విగ్రహం ఏర్పాటుచేసి జోతలు పడుతున్నది.

దేవరుప్పుల, జనవరి 6 : తెలంగాణ వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్‌. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్‌. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్‌ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. సీఎం కేసీఆర్‌ చొరవతో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న ఈ వాగుపై నాలుగు చెక్‌డ్యాం లు కట్టించారు. కొంతకాలం క్రితం కురిసిన వర్షాలకు చెక్‌డ్యాంలు నిండి గొల్లపల్లి వాగు నీటిప్రవాహంతో జీవనదిని తలపిస్తున్నది. ఈ వాగుపైనే రూ.5 కోట్లతో మరో చెక్‌డ్యాం కూడా మంజూరైంది. దేవాదుల కాలువల ద్వారా నవాబుపేట, ఘనపురం రిజర్వాయర్ల నుంచి మండలంలోని 95 శాతం చెరువులు మూడేండ్లుగా మత్తళ్లు పోస్తున్నాయి. ఇండ్లులేని వారికోసం శ్రీకాంతాచారి కాలనీ పేరిట డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. 

స్వగ్రామంలో అమరుడి విగ్రహం

శ్రీకాంతాచారిని కన్న గొల్లపల్లి నేడు మురిసిపోతున్నది. అతడు తమ గ్రామానికి చెందినవాడు కావడం గర్వకారణమని గ్రామస్థులు చెప్పుకుంటారు. ఆ అమరుడికి నివాళిగా గ్రామానికి ఆనుకుని వెళ్తున్న జాతీయరహదారి పక్కన శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.