మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:25

వ్యవసాయంలో తెలంగాణ గ్రేట్‌

వ్యవసాయంలో తెలంగాణ గ్రేట్‌

  • కొత్త ప్రాజెక్టులతో భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం
  • తెలంగాణకు ఎరువుల కొరత రానివ్వం
  • కేంద్రమంత్రి సదానందగౌడ హామీ
  • కేంద్రమంత్రితో మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న తీరు పట్ల కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానందగౌడ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త నీటి ప్రాజెక్టులను అత్యంత వేగంగా పూర్తిచేయ డం వల్ల రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా పంటలసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కొనియాడారు. దేశానికే ధాన్యాగారంగా ఎదుగుతున్న తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎరువులను సరఫరాచేస్తామని చెప్పారు. సోమవారం సదానందగౌడను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ.. ఎరువుల సరఫరాకు సంబంధించిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయం గా ఫోన్‌చేసి చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు 10.50 లక్షల టన్నుల యూరియాను అందజేస్తామని హామీ ఇచ్చారు. జూలై నెలాఖరుకు 1.5 లక్షల టన్నుల యూరియాను అందజేస్తామని చెప్పారు. ఎరువుల సరఫరాపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి సదానందగౌడకు.. మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


logo