శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 23:53:24

పీవీ.. ఆరని దివిటీ

పీవీ.. ఆరని దివిటీ

  • ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతి స్వామి

ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ డైరీలో ఆయన అలా రాసుకున్న 25 రోజులకే దేశ రాజకీయాలు తారుమారయ్యాయి. వెంటనే ఆయనకు ప్రధాని పదవి అందడం, దేశ ఆర్థిక గమనాన్ని పురోగమన దిశలోకి మళ్లించడం వంటివన్నీ జగద్విదితమే.అయితే సన్యాస దీక్ష తీసుకొని పీఠాధిపతిగా మారాలనుకున్న కుర్తాళం పీఠానికి పీవీ నరసింహారావుకు ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉందని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, మహా మంత్ర స్వరూపులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి చెబుతున్నారు. పూర్వాశ్రమంలో డాక్టర్‌ ప్రసాద రాయ కులపతి పేరుతో తెలుగు ఆచార్యులుగా, అవధాన సరస్వతిగా ప్రసిద్ధి కెక్కిన ఆయన పీవీ చేసిన సాహితీసేవలపై కూడా వ్యాఖ్యానించారు. నమస్తే తెలంగాణతో ఆయన పంచుకున్న విశేషాలివి. 

1991. సార్వత్రిక ఎన్నికలతో దేశం కోలాహలంగా ఉంది. పీవీకి అప్పటికి 69 ఏండ్లు నిండాయి. కేంద్ర కేబినెట్‌లో కీలకమైన హోదాల్లో పనిచేసిన పీవీకి ఆ దఫాలో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ నిరాకరించారు. దాంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని 1991 ఏప్రిల్‌ 26న తన డైరీలో ఇలా రాసుకున్నారు. ‘34 ఏండ్ల నా రాజకీయ జీవితంలో మొదటిసారి శూన్యత ఆవహించింది. ఇక నేను విరమించుకునే సమయం ఆసన్నమైంది’. ఢిల్లీలో ఆవాసాన్ని వదులుకొని తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వరీ పీఠం అధిపతిగా సేవలందించేందుకు 

ప్రధాని పీఠాన్ని అధిష్టించినా పీవీ మౌనమునిగానే ప్రసిద్ధి పొందారు. సహజ సిద్ధమైన గాంభీర్యతే ఆయన వ్యక్తిత్వ అలంకారమా?

(సిద్ధేశ్వరానంద-) ప్రతి వ్యక్తికి కొన్ని సహజమైన జీవ లక్షణాలు ఉంటాయి. గంభీరత పీవీ లక్షణం. అది ఆయన ప్రత్యేకత. అది గొప్ప సాధనతో కూడుకున్న పని. పీవీకి మహర్షులు, స్వాములతో సాన్నిహిత్యం ఉండేది. కుర్తాళ పీఠంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. కుర్తాళ పీఠ వ్యవస్థాపకులు మౌనముని శ్రీ శివ చిదానంద సరస్వతి ప్రభావం కూడా పీవీపై ఉంది. అంతే కాకుండా స్వాతంత్య్ర సమరం నుంచి ఆయన చూసిన ఎన్నెన్నో సంఘర్షణలు, పాలుపంచుకున్న పోరాటాలు, దేశ సేవ కోసం అహరహం చేసిన మేథోమథనంతో ఆయన వ్యక్తిత్వానికి అనంతమైన అనుభవం, మౌనం అలంకారాలుగా మారాయనే చెప్పాలి.

దేశ సేవను తపస్సుగా భావించి ఆచరించి చూపిన పీవీకి ఇతర నేతలకు ఏమిటి భేదం?

(సిద్ధేశ్వరానంద-) ‘నిశీథిలో పుంజముగ వెలుగుటయే నా తపస్సు’ అని ఆయన అన్నారు కానీ ఆయన రాత్రీ పగలూ వెలిగిన పుంజము. సమాజంలో ఉన్న వెనకబాటుతనాన్ని పారదోలేందుకు ఆయన నిరంతరం వెలిగిన దివిటీ. జాగృత స్వప్న సుషుప్తి స్థితులలో కూడా ఆయన ఓ తేజస్సులా వెలిగారు. దేశ సేవ చేసి  రాజకీయాల్లోకి అధికారంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న కొంతమంది మహానుభావులు మాత్రం ధర్మనిష్ట, సత్యనిష్టలను తపస్సులా ఆచరించారు.ఇందుకు మహాత్మా గాంధీ బోధనలు కూడా తోడ్పడ్డాయి.‘ఆతడజాతశత్రుడు మహాత్ముడు శాంత తపస్వి విశ్వ విఖ్యాతుడు ధర్మరాజు. అతని ఆత్మిక శక్తికి లేవసాధ్యముల్‌' అని గాంధీని వర్ణిస్తారు కరుణశ్రీ. ఆ గాంధీ ప్రబోధానుసారమే వాళ్లందరూ అహింసా సిద్ధాంతాన్ని, విలువలను పాటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా వాటిని మరిచిపోలేదు. పీవీ అత్యంత ధర్మనిష్ట కలిగిన వారు. ఆయన ఆ మార్గంలో రాణిస్తూనే అపర చాణక్యుడుగా ప్రసిద్ధికెక్కారు 

1991లో ప్రధాని పదవి చేపట్టేకన్నా ముందు పీవీకి కుర్తాళం పీఠాన్ని అధిష్టించాలని ఆహ్వానం అందిందని అంటారు. కుర్తాళం పీఠంతో పీవీకి ఎప్పటి నుంచి అనుబంధం ఉంది?

(సిద్ధేశ్వరానంద-) కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమరామానంద భారతికి పీవీ అత్యంత సన్నిహితుడు. శిష్యుడు కూడా. చాలాసార్లు పీవీ ఆయనను తమ ఇంటికే ఆహ్వానించి ఆయనకు గురు ఆతిథ్యమిచ్చేవారు. తమ ఇంట్లో లలితాదేవి పూజలు జరిపించేవారు. ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక సంభాషణలు జరిగేవి. ఆ సాన్నిహిత్యం ఆ మార్గం పీవీని ఎంతో ప్రభావితం చేసింది. పీవీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మనోయోగి, ఆధ్యాత్మిక వేత్తయే కుర్తాళం పీఠం అధిష్టిస్తే బాగుంటుందని త్రివిక్రమ రామానంద భారతి భావించారు. అందుకు పీవీతో అంగీకారం కూడా తీసుకున్నారు. ఉత్తరాధికారిగా నియమించేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇందుకు సంబంధించిన ఆయన రాసిన వీలునామాలో పీవీ పేరు కూడా ఉంది. ఆ సమయంలో పీవీ రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కుర్తాళం వచ్చి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు.

అయితే దేశ రాజకీయాల్లో  అకస్మాత్తుగా కీలక మార్పులు జరిగి భారతదేశ ప్రధానిగా పీఠాన్ని అధిష్టించే అవకాశం రావడంతో పీవీ మార్గం మారింది. ఆ తర్వాత ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. కుర్తాళం పీఠానికి ఎప్పటి నుంచో ఆయన సన్నిహితులు. పీఠాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. అధికారంలో ఉన్న వ్యక్తికి అకారణంగానే చాలా మందితో శత్రుత్వం ఏర్పడుతుంది. వీటికి పీవీ అతీతుడేమీ కాదు. పీవీపై అప్పట్లో దుష్ట ప్రయోగాలు జరిగాయని ఓ అత్యంత ప్రముఖ వ్యక్తి ఓ పుస్తకంలో ఉటంకించారు. అది నిజమేనని కుర్తాళం పీఠం కూడా తెలుసుకున్నది. వాటి నుంచి ఆయనను కాపాడేందుకు మా పూర్వపు పీఠాధిపతి శివ చిదానంద భారతి ఆధ్వర్యంలో హోమాలు జరిగాయి. త్రివిక్రమ రామానంద భారతి, శివ చిదానం భారతిల ఆధ్వర్యంలో జరిగిన అనేక ఆధ్యాత్మిక సంగమాలకు పీవీ హాజరవుతుండేవారు.  

ఇంటర్యూ.. చిరంజీవి ప్రసాద్‌ సంతపూరు

‘మా పీవీ మేధావి. మధుర కళాజీవి. అతని వశం వాగ్దేవి. అతని పరం నవభావి’అని దాశరథి చెప్పింది అక్షర సత్యం. బహిర్‌లోకంలో పీవీ ఓ రాజనీతివేత్తగా ప్రకాశించారు. కానీ అంతరాంతరాలలో ఆయన సాహిత్య జీవి. అందువల్లే ఆయన ఎన్నో గ్రంథాలను, రచనలను, సాహిత్యాన్ని అవపోశన పట్టారు. అనువాదంలో దిట్ట. దేశం కోసం పోరాడుతూనే దేశహితమే ఆశయంగా పనిచేస్తూనే 17 భాషల్లో ప్రావీణ్యత సంపాదించడం అత్యంత దుర్లభం. అది పీవీ ఒక్కరికే సాధ్యమైంది. తన వంతు బాధ్యతగా లోకానికి తెలుగు సాహితీ స్వరూపాలను అందించగలిగారు. అందులో భాగంగానే వేయి పడగలను హిందీలో సహస్రఫణ్‌గా, మరాఠీ నవల ‘పణ్‌ లక్ష్యాత్‌ కోణ్‌ ఘేతా’ను అబల పేరుతో తెలుగులోకి అవలీలగా అనువదించారు. అంతేకాదు విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు రావడం వెనక పీవీగారి శ్రమ కూడా దాగి ఉంది. తెలుగు జాతికి సంబంధించి అనేక మంది కవులు ఆయనకు సుపరిచితులే. తెలంగాణ కవులతో ఆయనకు అనుబంధం మరీ ఎక్కువ అన్న విషయమూ తెలిసిందే.’


logo