శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:55:05

కన్నుల పండువగా మల్లన్న పెండ్లి

కన్నుల పండువగా మల్లన్న పెండ్లి

  • పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
  • భారీగా తరలివచ్చిన భక్తజనం 
  • హాజరైన మంత్రి మల్లారెడ్డి, మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

భక్తుల కొంగుబంగారం, కోరమీసాల స్వామి కొమురెల్లి మల్లన్న కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆదివారం కొమురవెల్లి క్షేత్రంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికలో భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి కల్యాణ ఘట్టం సాగింది. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు కొమురవెల్లి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 

సిద్దిపేట ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కోరమీసాల స్వామి కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని ఆలయ తోటబావి ప్రాం తంలో ఏర్పాటుచేసిన కల్యాణ వేదిక వద్ద మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వా మివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మహారాష్ట్రలోని భార్సీ మఠం సిద్ధగురు మణికంఠ శివాచార్యుల స్వామిజీ పర్యవేక్షణలో కల్యాణం జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. 


ఊరేగింపుగా కల్యాణవేదికకు..

స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల నుంచి ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 10:45 గంటల ము హూర్తానికి స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి తరఫున పడిగన్నగారి వంశస్తులు పడిగన్నగారి ఆంజనేయులు-అర్చన దంపతులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని వంశస్తులు మహాదేవుని మల్లికార్జున్‌-మానస దంపతులు కల్యాణాన్ని జరిపించారు. స్వామివారికి కన్యాదానం కింద మంత్రి హరీశ్‌రావు రూ.లక్షా వెయ్యి పదహార్లు, మల్లికార్జున స్వామి తరఫున కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ.లక్షా వెయ్యి పదహార్లు, అమ్మవార్ల పసుపు కుంకుమలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రూ. 1,116 సమర్పించారు.

50 వేల మంది హాజరు  

స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ అధికారులు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసన మండలి చీఫ్‌ విప్‌ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగనాగిరెడ్డి, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ దువ్వల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.