ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 19:53:12

బాసరలో ఈ నెల 8 నుంచి దర్శనాలకు అనుమతి

 బాసరలో ఈ నెల 8 నుంచి దర్శనాలకు అనుమతి

బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి  ఆలయాన్ని ఈనెల 8వ తేదీన తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 న నిలిపివేసిన దర్శనాలను 77 రోజుల తర్వాత అనుమతించబోతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌తో పాటు అధికారులతో  సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అభిషేక కార్యక్రమాల తర్వాత 6గంటల నుంచి సాయంత్రం 7గంటల దాకా భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. 

పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన, ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాలు ఉండవని ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు.  ఆలయ పరిసరాలను పూర్తిగా శానిటైజేషన్‌ చేయనున్నారు. క్యూలైన్‌లో భక్తులు భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 


logo