మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 02:20:48

ఎగువన కృష్ణమ్మ..దిగువన గోదారమ్మ పరవళ్లు

ఎగువన కృష్ణమ్మ..దిగువన గోదారమ్మ పరవళ్లు

  • ఆల్మట్టి, నారాయణపురకు స్థిరంగా ఇన్‌ఫ్లోలు
  • జూరాలలో ఐదుగేట్లు ఎత్తివేత
  • దిగువకు 53,853 క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు  
  • కాళేశ్వరం లింక్‌-1 బరాజ్‌లన్నింటా జలకళ
  • నేడు ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల 

కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టులు.. గోదావరి బేసిన్‌లో బరాజ్‌లలో జలకళ ఉట్టిపడుతున్నది. ఆల్మట్టి నుంచి ఔట్‌ఫ్లో.. తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు, తుంగభద్ర వరద తోడు కావడంతో కృష్ణా జలాలు శ్రీశైలంలో మల్లన్న చెంతకు చేరాయి. జూరాలలో కరెంట్‌..  ఐదు గేట్ల ద్వారా నీళ్లు దిగువకు విడుదలవుతున్నాయి. అటు ప్రాణహిత, మానేరు వాగులతో కాళేశ్వరం పథకంలోని బరాజ్‌లు నిండుతున్నాయి. సరస్వతి, పార్వతి, నంది పంప్‌హౌజ్‌లలో ఒక్కోమోటర్‌ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టు రెండుగేట్ల ఎత్తి ఐదువేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లు జలకళను సంతరించుకొంటున్నాయి. శ్రీశైలం జలాశయానికి గతేడాది కంటే ముందుగానే వరద మొదలైంది. ఎగువన ఆల్మట్టి.. నారాయణపుర ద్వారా దిగువకు వదిలిన జలాలు జూరాల మీదుగా శ్రీశైలం చేరుకున్నాయి. తెలంగాణ, ఏపీలోనూ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు స్థానిక పరివాహక ప్రాం తాల నుంచి కూడా వరద వస్తున్నది. మంగళవారం కూడా ఆల్మట్టికి 40వేల పైచిలుకు వరద నమోదైంది. దీంతో కర్ణాటక అధికారులు జలాశయంలో 96 టీఎంసీల నీటినిల్వను నిర్వహిస్తూ.. 46వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపురకు వస్తున్న వరద వచ్చినట్టే దిగువకు విడుదలవుతున్నది. నారాయణపుర నుంచి గత రెండ్రోజులుగా వస్తున్న నీటితో జూరాల జలాశయం కళకళలాడుతున్నది. జూరాల వద్ద మంగళవారం రాత్రి పది గంటలకు 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమో దైంది. మంగళవారం ఉదయం జూరాలలో కరెంట్‌ ఉత్పత్తి ప్రారంభించిన అధికారులు.. రాత్రి పదిగంటల తర్వాత ఐదుగేట్లు ఎత్తి దిగువకు జలాలు విడుదల చేశారు. ఎగువ జూరాలలో 1, 3, 6 యూనిట్లలో 108 మెగావా ట్లు, దిగువ జూరాలలో 2, 4 యూనిట్లలో 68 యూనిట్ల కరెం టు ఉత్పత్తి అవుతున్నదని డైరెక్టర్‌ వెంకటరాజం తెలిపారు. ఐదుగేట్లు ఎత్తడం, కరెంటు ఉ త్పత్తి, నెట్టెంపాడు,భీ మా, కోయిల్‌సాగర్‌తోపా టు, కుడి, ఎడమ సమాంతర కాలువకు నీటివిడుదల ద్వారా జూరాల నుంచి 53,853 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతున్నది. 

సాయంత్రానికే శ్రీశైలంలో పెరిగిన ఇన్‌ఫ్లో

జూరాల నుంచి వదిలిన జలాలు చేరుకోవడానికి ముందే మధ్యలో పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో మొదలైంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం వద్ద 23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీనికి జూరాల నుంచి వచ్చే జలాలు కూడా తోడైతే.. బుధవారం తెల్లవారుజాము నుంచే శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులకుపైగా నమోదయ్యే అవకాశమున్నది. మరోవైపు రాష్ట్రంలోనూ మంచివర్షాలు కురుస్తుండటంతో నాగార్జునసాగర్‌కు కూడా మోస్తరు వరద వస్తున్నది. మంగళవారం సాయం త్రం ఆరుగంటలకు సాగర్‌కు ఐదువేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో వస్తున్నది. తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగ నదికి వరద ప్రవాహం చేరుతుండటం తో అప్పర్‌ తుంగ ప్రాజెక్టు నుం చి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 23.114 టీఎంసీల నీటినిల్వ ఉన్నది.

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ రెండుగేట్లు ఎత్తి మంగళవారం ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, బయ్యారం ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీవరద చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులకుగాను 403.6 అడుగులకు చేరింది.

గోదారిలో 111 కిలోమీటర్లు జలకళ

గోదావరి బేసిన్‌లో దిగువన జలాలు పోటెత్తుతున్నాయి. ఎస్సారెస్పీకి వరద పూర్తిగా తగ్గినా.. దిగువన ప్రాణహిత, మానేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నుం చి లక్ష్మీబరాజ్‌కు 29,800ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల బరాజ్‌లో ప్రస్తుతం 11.953 టీఎంసీలు ఉండగా, 17 గేట్లు ఎత్తి అదేస్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. మహదేవపూర్‌ మండలం అన్నారం వద్ద ఉన్న సరస్వతీ బరాజ్‌కు మానేరు, ఇతర వాగు ల నుంచి 2,900ల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. బరాజ్‌లోప్రస్తుతం 6.24 టీఎంసీల నీటినిల్వ ఉండగా.. సరస్వతీ పంపుహౌజ్‌లో ఒక మోటర్‌ను ఆన్‌చేసి పార్వతీ బరాజ్‌లోకి 2,930 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. పార్వతీ పంప్‌హౌజ్‌ నుంచి ఒక మోటర్‌ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 2,610 క్యూసెక్కుల నీటిని పంపుతున్నారు. ఎల్లంపల్లి నుంచి టన్నెళ్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లోని నంది పంప్‌హౌజ్‌కు జలాలు చేరుతుండగా.. అక్కడి నుంచి 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-1లో లక్ష్మీబరాజ్‌ మినహా ఇతర పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోతలు కొనసాగుతుండటంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 111 కిలో మీటర్ల గోదావరి జీవనదిలా కనిపిస్తున్నది.  బుధవారం నుంచి కాకతీయ కాల్వకు ఎల్‌ఎండీ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. logo