గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 02:16:10

బైలెల్లిన వలస కూలీల బండి

బైలెల్లిన వలస కూలీల బండి

  • జార్ఖండ్‌లోని హతియాకు 1,224 మంది తరలింపు 
  • లింగంపల్లి నుంచి బీహార్‌ బయలుదేరిన ప్రత్యేక రైలు 
  • లాక్‌డౌన్‌లో కూలీలను తరలించిన తొలి రైలు ఇదే 

హైదరాబాద్‌/సంగారెడ్డి ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: కార్మిక దినోత్సవం రోజున వలస కార్మికులకు పెద్ద ఊరట. లాక్‌డౌన్‌ కారణంగా 39 రోజులుగా సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ భవన నిర్మాణాల్లో పాల్గొనేందుకు వచ్చి చిక్కుకుపోయిన 1,224 మంది కూలీలు  ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో బీహార్‌, జార్ఖండ్‌ రాష్ర్టాల కూలీలు ఉన్నారు. వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం అనుమతివ్వడంతో.. కేంద్ర హోంమంత్రిత్వశాఖతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ప్రత్యేకరైలును ఏర్పాటుచేసింది. శుక్రవారం తెల్లవారుజామునే కంది ఐఐటీ ప్రాంగణంలో వలస కూలీలకు థర్మల్‌స్క్రీనింగ్‌ చేసి  అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాక 56 బస్సుల్లో లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఒక్కోబోగీలో 54 మందిని అనుమతించి.. శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లు, సరిపడా భోజనం అందించారు. కూలీలంతా అధికారులకు వీడ్కోలు పలికి సంతోషంగా రైలెక్కారు. ఉదయం 4.55 గంటలకు బయలుదేరిన ప్రత్యేకరైలు అర్ధరాత్రి జార్ఖండ్‌లోని హతియా చేరుకున్నది. అక్కడి నుంచి వలసకూలీలను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినట్టు సమాచారం. 

మిగతా కార్మికులదీ అదే డిమాండ్‌

ఐఐటీ నిర్మాణంలో పనిచేసేందుకు బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశాకు చెందిన 2,464 మంది వచ్చారు. లాక్‌డౌన్‌ అమలుతో వీరంతా ఉపాధి కోల్పోయారు. నిర్మాణాలు చేపడుత్ను కాంట్రాక్ట్‌ సంస్థ, పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వకపోవడంతో నిరసిస్తూ, సొంతూళ్లకు పంపించాలని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులను పిలిచి చర్చించి మార్చి నెల వేతనాలు వారి బ్యాంకుఖాతాల్లో జమచేయించారు. జార్ఖండ్‌, బీహార్‌ కూలీలు వెళ్లిపోవడంతో తమను కూడా సొంతరాష్ట్రాలకు పంపించాలని ఐఐటీలో ఉన్న మిగతా రాష్ర్టాల కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణవాసుల కోసం మరో నాలుగు నంబర్లు

వలస కార్మికులను గుర్తించడాన్ని కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారు ఆయా  జిల్లాల కంట్రోల్‌రూంల ఫోన్‌నంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది. ఇతరరాష్ట్రాల్లో ఉన్న తెలంగాణవాసులు స్వస్థలాలకు రావాలనుకుంటే సచివాలయంలోని కంట్రోల్‌రూం నంబర్లు 040-23450624, 040,23450735, హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7997950008తోపాటు పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 9010203626 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. 

దేశవ్యాప్తంగా ఆరు శ్రామిక్‌ రైళ్లు 

వలస కార్మికులు, విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఆరు ‘శ్రామిక్‌' రైళ్లను ఏర్పాటుచేసింది. తొలిరైలు హైదరాబాద్‌ నుంచి జార్ఖండ్‌కు బయలుదేరి వెళ్లింది. మిగిలిన ఐదు రైల్లు.. నాసిక్‌ నుంచి లక్నోకు, అలువా నుంచి భువనేశ్వర్‌కు, నాసిక్‌ నుంచి భోపాల్‌కు, జైపూర్‌ నుంచి పాట్నాకు, కోటా నుంచి హతియాకు బయలుదేరి వెళ్లాయి. 

యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం

వలస కూలీలను సొంతరాష్ర్టాలకు పంపేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. గురువారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, నోడల్‌అధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, జితేందర్‌, రవాణశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ చర్చించి ప్రణాళికను రూపొందించారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేకరైలును ఏర్పాటుచేయించారు. శుక్రవారం తెల్లవారుజామున వలస కూలీలను తరలించారు. 


logo