ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 18:17:57

కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మాజీ ఎంపీ కవిత

కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ కవిత, సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కవిత పేర్కొన్నారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య సమరయోధులు, జాతి నిర్మాతలను స్మరించుకునేవాళ్లమని, అయితే ఈసారి మాత్రం కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులను సైతం గుర్తుచేసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలను ఇంట్లో భద్రంగా దాచి, మౌలిక అంశాలు యధావిధిగా నడవడానికి గుప్పెడు సైనికులు కృషి చేస్తున్నారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. కరోనా నేపథ్యంలో 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండ్రి కోసం సైకిల్ మీద వెళ్లిన ఆడబిడ్డను, కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేస్తున్న మహానుభావులను, అనేక మందికి అన్నదానం చేస్తున్న వారిని ఆమె గుర్తుచేసుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి ‌కుటుంబాన్ని‌ కాపాడుకోవడానికి ప్రాచీన పద్ధతులను పాటిస్తున్న మాతృమార్తులను ఈ సందర్భంగా కవిత అభినందించారు. వంటింటి నుంచి వాఘా సరిహద్దు దాకా.. దేశమంతా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలనే సంకల్పం బలపడిందన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈ బలమైన సంకల్పాన్ని నిజం చేసే దిశగా ‌ముందు వరుసలో ఉండి కృషి చేస్తున్న ఉద్యోగులకు, సైనికులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.



logo