మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 00:28:22

139 పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌

139 పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌

  •  యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం
  • రోడ్లపై పిచ్చిమొక్కలు, పొదల తొలిగింపు
  • ఈ నెల  8 దాకా కొనసాగనున్న కార్యక్రమం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలంలో  సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు పట్టణాల్లో మంగళవారం నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 8లోపు రాష్ట్రంలోని 127 మున్సిపాలిటీల్లోని 2,894 వార్డులు, 12 కార్పొరేషన్లలోని 511 వార్డులను శుభ్రం చేయడమే లక్ష్యంగా పురపాలన విభాగం యుద్ధప్రాతిపదికన పనుల్ని చేపట్టింది. రాష్ట్రంలోని 139 పట్టణాల్లో 18,920 కిలోమీటర్ల పొడవున్న ఉన్న రహదారుల్లో 6,035 కిలోమీటర్ల మేరకు రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. మంగళవారం సాయంత్రానికి 495 కిలోమీటర్ల మేరకు పరిశుభ్రం చేశారు. పట్టణాల్లోని 1,89,455 చదరపు గజాల ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించారు. 139 పట్టణాల్లో సుమారు 2,456 కిలోమీటర్ల మేరకు మూడడుగుల వెడల్పు గల వరదనీటి కాల్వల్లో దాదాపు 241 కిలోమీటర్ల వరకు శుభ్రం చేశారు. 13,410 కిలోమీటర్ల మేరకు డ్రైనేజీలు ఉండగా, వాటిలో 1,378 కిలోమీటర్ల వరకు శుభ్రం చేశారు. గత నెలాఖరు నాటికి పట్టణాల్లో 9,196 టన్నుల నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోగా, అందులో 879 టన్నులను ఇతర ప్రాంతాలకు తరలించారు. 506 వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్‌ చల్లడంతోపాటు బ్లీచింగ్‌, సున్నంతో 634 బ్లాక్‌ స్పాట్‌లను మూసివేశారు. 699 ప్రాంతాల్లో యాంటీ లార్వా మందు పిచికారీ చేశారు. 393 వార్డుల్లో ఫాగింగ్‌ చేశారు. ఈ సందర్భంగా పురపాలన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈనెల 8 నాటికి రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 


logo