బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:33:56

కొరియా కంపెనీలకు ప్రత్యేక పార్కు

కొరియా కంపెనీలకు ప్రత్యేక పార్కు

  • ఇప్పటికే  పలు కంపెనీల రాక
  • పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే దక్షిణ కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడను ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ఇండియా-కొరియా బిజినెస్‌ ఫోరం నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రత్యేకంగా వివరించారు. దక్షిణ కొరియానుంచి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారమందిస్తుందని హామీ ఇచ్చారు. 

టీఎస్‌ఐపాస్‌ విధానంతో తెలంగాణ ముందుకు పోతున్నదని గుర్తుచేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో రూపొందించిన విధానాలతో ఆరేండ్లలో దాదాపు 30బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. కొరియాకే చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్రపరిశ్రమ యంగ్‌వన్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటుచేస్తున్న మెడికల్‌ డివైసెస్‌ పార్కు ద్వారా కొరియాలోని గంగ్‌వన్‌ టెక్‌పార్కుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నామని వెల్లడించారు. హ్యుందాయ్‌ కంపెనీ తెలంగాణలో తన కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నదని తెలిపారు. దక్షిణ కొరియా కంపెనీలకు రెడ్‌కార్పెట్‌ వేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, భారత, దక్షిణకొరియా రాయబారులు , పలు రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు పాల్గొన్నారు.