శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 13:52:19

ప్రమాదకర జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు : కలెక్టర్‌ శశాంక

ప్రమాదకర జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు : కలెక్టర్‌ శశాంక

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ... కరీంనగర్‌లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు తెలిపారు. హోమ్‌, ఆస్పత్రి క్వారంటైన్లలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. వారిందరిని 14 రోజులపాటు క్వారంటైన్లలోనే ఉంచనున్నట్లు తెలిపారు.  కూరగాయాలు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్న టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి తెలపాలని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే కరోనా నుంచి అంత త్వరగా బయటపడతామన్నారు. సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద జనం గుమిగూడొద్దని కోరుతున్నట్లు తెలిపారు. అలా ప్రజలు గుమిగూడి ఉంటే దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. 

క్వారంటైన్‌లో ఉన్నవారి పాస్‌పోర్టులు స్వాధీనం...

హోం క్వారంటైన్‌లో ఉన్నవారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు.. హోం క్వారంటైన్‌ తర్వాత వారి పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చేస్తామని సీపీ కమలాన్‌రెడ్డి తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ... కరోనా సోకిన 11 మందిలో 10 మంది ఇండోనేషియా వాసులు అన్నారు. కరీంనగర్‌లో స్థానికుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. ఇండోనేషియా బృందంతో తిరిగిన అందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. కరీంనగర్‌లో రాబోయే రెండు వారాలు చాలా కీలకమన్నారు. పౌరులు అనవసరంగా రోడ్లపైకి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు తమకు సహకరించి ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. ప్రార్థనా మందిరాల వద్ద ఎవరూ ప్రార్థనలు చేయకూడదన్నారు. ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో 560 మంది ఉన్నారు. హోం క్వారంటైన్‌ నుంచి పారిపోయిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.


logo