మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 19:18:13

పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు : పీసీసీఎఫ్‌ శోభ

పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు : పీసీసీఎఫ్‌ శోభ

జయశంకర్‌ భూపాలపల్లి  : రాష్ట్రంలో పోలీస్‌ శాఖ సహకారంతో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రొయ్యూరు శోభ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎస్‌ జెన్‌కో ఆవరణలో ఉన్న గోదావరి అతిథి గృహంలో గురువారం వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘అంతర్రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ’పై ఒక్క రోజు వర్క్‌ షాప్‌, సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పీసీసీఎఫ్‌ శోభ విలేకరులతో మాట్లాడారు. 

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి గత 15-20 ఏండ్ల తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా అడవుల్లో పెద్ద పులల సంచారం వెలుగుచూసిందని చెప్పారు. మన అడవుల్లో పెద్ద పులల సంచారం ఉండడంతో వాటి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సరిహద్దు రాష్ర్టాల పోలీస్‌, అటవీశాఖ అధికారులతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. కలప, వెదురు స్మగ్లింగ్‌, జంతువుల వేట నివారణకు మూడు  రాష్ర్టాల మధ్య చెక్‌ పోస్టుల్లో మార్పులు చేస్తున్నామని, రేంజ్‌ వారీగా చెక్‌పోస్టుల ఏర్పాటుకు రెండు రాష్ర్టాల అధికారులతో మాట్లాడి  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


అడవులు, అభయారణ్యాలు ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పులుల సంరక్షణకు తడోబా, ఇంద్రావతి, కవ్వాల్‌, కిన్నెరసాని టైగర్‌ జోన్‌ డైరక్టర్లు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి స్వర్గం శ్రీనివాస్‌, నేషనల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ టైగర్‌ జోన్‌ డైరెక్టర్‌ మురళి,  కలెక్టర్లు అబ్దుల్‌ అజీం, కృష్ణ ఆదిత్య, రామగుండం సీపీ సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీలు, మూడు రాష్ర్టాల అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.