మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:16:09

అడవికాచిన అన్వేషణ

అడవికాచిన అన్వేషణ

  • పులికోసం కాగజ్‌నగర్‌ అడవుల్లో తప్పని నిరీక్షణ
  • రెండున్నరేండ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న కే-4
  • కొండాపూర్‌, బెజ్జూరులో ఆడపులిదీ అదే పరిస్థితి

అడుగడుగునా కెమెరా ట్రాప్‌లు.. బోన్లలో ఎరగా జంతువులు.. టైగర్‌ ట్రాకర్లు.. చెట్లపై మచాన్లతో మాటువేసిన సిబ్బంది.. కాగజ్‌నగర్‌ అడవుల్లో కే-4 అనే పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. రెండున్నరేండ్లుగా కొనసాగుతున్న వారి అన్వేషణ అడవి కాచిన వెన్నెలగానే మారుతున్నది తప్ప కే-4 జాడమాత్రం దొరకడంలేదు. ఎన్ని ఎత్తులు వేసినా అధికారుల ఉచ్చుకు దొరకకుండా తప్పించుకుంటూనే ఉన్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అడవుల్లో ఇద్దరిని బలిగొన్న పులి కూడా ఇప్పటివరకు పట్టుబడలేదు.

ప్రత్యేక ప్రతినిధి, జనవరి 3(నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుతో గాయపడిన కాగజ్‌నగర్‌-4 (కే-4) అనే ఆడపులిని పట్టుకోవడానికి రెండేండ్లుగా అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కవ్వాల్‌ అభయారణ్యంలోని చెన్నూరు డివిజన్‌లో ఇనుప ముక్క కుచ్చుకుని కే-4 గాయపడ్డట్టు అటవీ అధికారులు గుర్తించారు. దానిని సురక్షితంగా బంధించి చికిత్స చేశాక తిరిగి అడవిలో వదలాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండేన్నరేండ్ల క్రితం కే-4 ఆపరేషన్‌ చేపట్టారు. దాని జాడను గుర్తించేందుకు మంచిర్యాల, చెన్నూరు డివిజన్‌లో దాదాపు 50 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటుచేశారు. ఇరవైమంది టైగర్‌ ట్రాకర్లను నియమించారు. దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో పది బోన్లు ఏర్పాటు చేసి మేక, జింక వంటి జంతువులను ఎరగా ఉం చారు. చెట్లను పోలిన ఆకారంలో ఏర్పాటుచేసిన బోనుల సమీపంలోకి వచ్చిన పులి.. జంతువులు ఒకేచోట ఉన్నట్టు గమనించి అనుమానంతో వెనక్కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అధికారులు పొడవాటి తాళ్లతో జంతువులను కట్టి ఉంచి సహజంగా తిరిగేలా ఏర్పాటు చేశారు. అయినా పులి వాటివైపు  రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. పులి సంచరించే ప్రదేశాల్లో నీటి కుంటలున్నచోట్ల చెట్లపై ఫోల్డబుల్‌ మచాన్లను కట్టి గన్‌ద్వారా మత్తుమందు (ట్రాంక్విలైజ్‌)ను ప్రయోగించడానికి అనేక ప్రయత్నాలుచేసినా ఫలించడం లేదు. యవ్వనదశకు వచ్చిన కందబ-4 ఆడపులిని ఆకర్షించడానికి మగపులి వాసనను కలిగి ఉండే కాల్విన్‌ కెవిన్‌ (calvin kawin) సెంట్‌ను లండన్‌ నుంచి తెప్పించి స్ప్రేచేసినా పులి జాడను పసిగట్టలేకపోతున్నారు.

చిక్కని మ్యాన్‌ఈటర్‌

ఆసిఫాబాద్‌ రేంజ్‌ దిగడ గ్రామంలో ఓ యువకుడు, బెజ్జూరు కొండపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువతిని బలి తీసుకున్న పెద్దపులిని పట్టుకొనే ప్రయత్నాలు కూడా నెలరోజులుగా ఫలించడంలేదు. కొండాపూర్‌, బెజ్జూరులో అదనంగా మరో 31 కెమెరా ట్రాప్‌లను, నాలుగు ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటుచేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడానికి టైగర్‌ ట్రాకర్లతో నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. దిగడ గ్రామంలో పులి దాడి జరిగిన ప్రాం తంలో చెట్లపై మచాన్లతో కాపు కాస్తున్నారు. కానీ, మహారాష్ట్ర చంద్రాపూర్‌ నుంచి వచ్చినట్టుగా అనుమానిస్తున్న ఆడపులి తెలివిగా తప్పించుకుంటూనే ఉన్నది.

పెద్దపులులు మహాచలాకీలు

పెద్దపులులు తీక్షణమైన చూపుతో చలాకీగా ఉంటాయి. వానరజాతి తర్వాత పిల్లి జాతి అత్యంత తెలివైనదిగా చెప్తారు. పెద్దపిల్లి జాతికి చెందిన రాయల్‌ బెంగాల్‌ టైగర్లు అత్యంత అప్రమత్తంగా ఉండే జంతువుల్లో అగ్రస్థానంలో ఉంటాయి. చిరుత పులుల కంటే కూడా జిత్తులమారులు. భూమిలో కనపడకుండా ఏర్పాటుచేసిన ఉచ్చులు, కృత్రిమంగా ఏర్పాటుచేసిన బోన్లను కూడా వాసనతో పసిగట్టగలవు. కృత్రిమంగా ఏర్పాటుచేసిన ఆహారాన్ని కనుక్కోగలుగుతాయి. సహజసిద్ధంగా సంచరిస్తున్న జంతువులను మాత్రమే వేటాడుతాయి. వేటాడాలనుకున్న జంతువుల కదలికల్లో ఏ మాత్రం అసహజత ఉన్నా వాటి జోలికిపోవు. కిలోమీటర్‌ దూరంనుంచే వాసనను పసిగడుతూ నిరంతరం అప్రమత్తతో వ్యవహరిస్తాయి. కారు చీకటిలోనూ పెద్దపులి కండ్లు టార్చ్‌లైట్లలా పనిచేస్తాయి. ఇవి ఎంత అప్రమత్తంగా ఉన్నా కే-4, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆడపులి కెమెరా ట్రాప్‌లకు కూడా చిక్కకపోవడమే మిస్టరీగా మారింది. పెద్దపులులను కేవలం మత్తుమందు ప్రయోగం ద్వారానే బంధించగలుగుతామని చంద్రాపూర్‌ అధికారులు చెప్తున్నారు. దీనిపై తెలంగాణ అటవీశాఖ అధికారులకు వారు కొన్ని మెలకువలు నేర్పారు.


logo