e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides దవాఖానలకు రెండో కరంట్‌ లైన్‌

దవాఖానలకు రెండో కరంట్‌ లైన్‌

దవాఖానలకు రెండో కరంట్‌ లైన్‌
  • నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు
  • అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా జనరేటర్లు
  • రోజంతా ఉపయోగపడేలా సౌర విద్యుత్‌ ఉత్పత్తి
  • గాంధీ, టిమ్స్‌, నిమ్స్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలు
  • సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు

హైదరాబాద్‌, మే 15 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న కీలక ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు ఆయా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ప్రధాన ప్రభుత్వ వైద్యశాలల్లో ఏకంగా కంట్రోల్‌ రూంలు నెలకొల్పి 24 గంటలపాటు పనిచేసేలా సిబ్బందిని నియమించాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా ప్రత్యామ్నాయంగా మరో లైన్‌ కూడా ఏర్పాటుచేశాయి. కరోనా విజృంభిస్తున్న వేళ దవాఖానల్లో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లుచేసినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రధానమైన గాంధీ, టిమ్స్‌, నిమ్స్‌, చెస్ట్‌, ఫీవర్‌, కింగ్‌కోఠి లాంటి ప్రభుత్వ దవాఖానలకు రెండు సబ్‌స్టేషన్ల నుంచి రెండులైన్లను ఏర్పాటుచేశారు. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి విపత్తుల సమయంలో (గాలి దుమారాలు, తుఫానులు, భారీ వర్షాలు) ఒక లైనులో విద్యుత్తు సరఫరాకు అవాంతరం ఎదురైతే.. వెంటనే రెండోలైను ద్వారా సరఫరా చేస్తారు. రెండోలైన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన కార్పొరేట్‌ దవాఖానలకు కూడా ఇలాంటి అవకాశం కల్పించారు.

ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు కూడా..

ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) రెండు ఆక్సిజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్లకు (జడ్చర్ల, సంగారెడ్డిలోని పాశమైలారం) కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించింది. ప్రత్యామ్నాయ లైన్లను ఏర్పాటుచేసి 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలోని ఆరు ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ సెంటర్లలోనూ విద్యుత్తును నిరంతరాయంగా అందించేలా సిబ్బందిని, అధికారులను అప్రమత్తంచేసినట్టు పేర్కొన్నారు.

విద్యుత్తు కంట్రోల్‌ రూంలు..

గాంధీ, టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), నిమ్స్‌ దవాఖానల్లో ప్రత్యేకంగా విద్యుత్తు కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 24 గంటలపాటు (మూడు షిఫ్టుల్లో) ఏఈ, లైన్‌మెన్‌, ఆర్టిజన్‌ సిబ్బంది ఉంటారు. వీరు విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దవాఖానవర్గాలతో సమన్వయం చేసుకుంటారు. మిగిలిన ప్రభుత్వ దవాఖానల్లోనూ నిరంతరం పర్యవేక్షించేలా సమీపంలోని సబ్‌స్టేషన్‌ సిబ్బందిని, ఎమర్జెన్సీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు ఇప్పటికే జనరేటర్లను సమకూర్చుకున్నాయి. ఇన్వర్టర్లను, సౌర విద్యుత్‌ ఫలకాలను కూడా ఏర్పాటుచేసుకున్నాయి. గాంధీ దవాఖానలో ఇప్పటికే 500 కేవీ జనరేటర్లు మూడు ఉన్నాయి. సౌర విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దవాఖాన అవసరాలకు సరిపోగా మిలిగిన విద్యుత్తును గ్రిడ్‌కు అందిస్తున్నట్టు గాంధీ వైద్యవర్గాలు తెలిపాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దవాఖానలకు రెండో కరంట్‌ లైన్‌

ట్రెండింగ్‌

Advertisement