హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు సాయం కోసం మనం డయల్ 100కు కాల్ చేయడం పరిపాటి. అలా మనం చేసిన ఫోన్.. కాల్‌సెంటర్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోకార్ లేదా బ్లూకోల్ట్స్ సిబ్బందికి అనుసంధానించబడుతుంది. అయితే షిప్ట్ పద్ధతిలో విధులు నిర్వహించే బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మారినప్పుడు వారికి మన ఫోన్‌కాల్‌ను అనుసంధానించడం కష్టమవుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని మొత్తం 3 వేల బ్లూకోల్ట్స్, పెట్రోకార్లకు ప్రత్యేకంగా సెల్ఫోన్లను కేటాయించారు. దీంతో సిబ్బంది మారినప్పటికీ డ్యూటీలో ఉన్నవారి వద్ద ఎప్పటికీ ఒకే నంబర్ సెల్‌ఫోన్ ఉంటుంది. తద్వారా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవడం సులువు అవుతుందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ నంబర్లు పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్, డివిజినల్ అధికారులవద్ద అందుబాటులో ఉంటాయి.