సోమవారం 01 జూన్ 2020
Telangana - May 23, 2020 , 02:03:43

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు

  • నేటి నుంచి హైదరాబాద్‌లో సేవలు
  • 32 రూట్లలో నడుపనున్న ప్రభుత్వం
  • సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను నడపాలని నిర్ణయించింది. శనివారం నుంచి 32 రూట్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగులు గుర్తింపు కార్డు చూపిస్తే బస్సులోకి అనుమతిస్తారని టీఎన్జీవో నాయకులు కారం రవీందర్‌రెడ్డి, మామిండ్ల రాజేందర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారుల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మమత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు వారు లేఖ రాశా రు. రెవెన్యూ ఉద్యోగులకు మే నెల వేతనా న్ని పూర్తిగా చెల్లించాలని ఆ ఉద్యోగుల సంఘం(ట్రెసా) విజ్ఞప్తి చేసింది. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులకు అడ్వాన్సులు చెల్లించాలని సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ కోరారు. వీఆర్‌ఏలకు మే పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఆ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు, గౌరవ అధ్యక్షుడు విజయరామారావులు విజ్ఞప్తిచేశారు. ఉపాధ్యాయులందరికీ మే నెల జీతం మొత్తం ఇవ్వాలని పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 


logo