శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:12:26

కండ్లముందు మహాద్భుతం

కండ్లముందు  మహాద్భుతం

  • ‘కొల్లూరు’ ఇండ్లపై స్పీకర్‌ పోచారం వ్యాఖ్య
  • నిర్మాణ పనులను వివరించిన మంత్రి కేటీఆర్‌
  • డబుల్‌ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన స్పీకర్‌, 
  • మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి

రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు మహాద్భుతం అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిర్మాణ పనులను గురువారం రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా డబుల్‌ బెడ్రూం ఇంటిలోని హాల్‌, బెడ్‌రూంలు, కిచెన్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా కొల్లూర్‌ ఆదర్శ టౌన్‌షిప్‌ నిర్మాణం, దాని విశిష్టతను మంత్రి కేటీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వివరించారు. 124 ఎకరాల విస్తీర్ణంలో సకల హంగులతో 15,660 ఇండ్లను నిర్మించినట్టు, ప్రతి బ్లాక్‌కు లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టౌన్‌షిప్‌లో ఉన్న సౌకర్యాలను వివరించారు. లిఫ్ట్‌లో 14 అంతస్తుల పైకి వెళ్లి టెర్రస్‌, వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం స్పీకర్‌, మంత్రులు డబుల్‌ బెడ్రూం నిర్మాణ సముదాయంలో మొక్కలను నాటారు. ఈ సందర్భం గా మాట్లాడిన స్పీకర్‌.. ప్రజలు గుర్తించేలా ఈ భవన సముదాయానికి ఒకే ర కం రంగువేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్చ్‌కు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. వారి వెంట సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి, తాసిల్దార్‌ శివకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటమణికరణ్‌, ప్రాజెక్ట్‌ ఎండీ అనిరుధ్‌గుప్తా, సీఈవో మధుసూదన్‌రావు, తదితరులు ఉన్నారు.

ఇతర ఏర్పాట్లు

  • మున్సిపల్‌ బిల్డింగ్‌
  •  బస్టాండ్‌
  • పోలీస్‌ స్టేషన్‌, ఔట్‌పోస్టు
  • ఫైర్‌ స్టేషన్‌
  • 200 బెడ్ల దవాఖాన 
  • పీహెచ్‌సీ సెంటర్లు
  • గుడి, చర్చ్‌లు
  • 5 షాపింగ్‌ కాంప్లెక్స్‌లు
  • హైస్కూల్‌, అంగన్‌వాడీ భవనాలు
  •  ప్రతి సెక్టార్‌లో పాల కేంద్రాలు
  •  అన్ని హంగులతో ఫంక్షన్‌హాళ్లు
  • దహన, ఖనన వాటికలు
  • టూవీలర్‌ పార్కింగ్‌
  • బ్యాంక్‌, ఏటీఎం, పోస్టాఫీస్‌
  • కూరగాయల మార్కెట్‌
  • నర్సింగ్‌ హోమ్‌, లైబ్రరీ
  • కమ్యూనిటీ సెంటర్లు
  • పెట్రోల్‌ బంక్‌

ఒక్కో భవనంలో నివాసముండే ప్రజలు అంచనా.. 60,000

స్వరూపం ఇలా...

వ్యయం :1360 కోట్లు

సెక్టార్లు : 8

భవనాలు : 117

డబుల్‌ ఇండ్లు  : 15,660

  • ఒక్కో ఇంటి నిర్మాణానికి వ్యయం   రూ.7.60 లక్షలు 
  • రెండు బెడ్రూంలు, హాలు, బాత్‌రూమ్‌, కిచెన్‌, రెండు టాయిలెట్లు  

మురుగునీటి శుద్ధి ప్లాంటు :  90 లక్షల లీటర్ల సామర్థ్యం

12 సంపులు : ఒక్కోటి 11 లక్షల లీటర్ల సామర్థ్యం

విద్యుత్‌ సబ్‌స్టేషన్లు :  33 కేవీ(1), 11 కెవీ(2) 

భవనాల ఎత్తు : 30 నుంచి 36 మీటర్లు

ప్రతి భవనానికి రెండు లిప్టులు, జనరేటర్‌, టూ వీలర్‌ పార్కింగ్‌

కల కాదు.. కొల్లూరు!

  • ఒక్కచోటే 15,600 డబుల్‌ బెడ్రూం ఇండ్లు
  • ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం
  • 1,360 కోట్లతో నిర్మించిన రాష్ట్ర సర్కారు

పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తాం అంటే ప్రతిపక్షాలు హేళన చేశాయి.. సకల సౌకర్యాలతో, సర్వ హంగులతో మోడ్రన్‌గా తీర్చిదిద్దుతామంటే వెక్కిరించాయి.. పక్కాగా, పది కాలాలపాటు పదిలంగా ఉండాలని నిర్మాణాలు చేపడితే పకపక నవ్వుకున్నాయి.. కానీ, వాళ్ల చెంప ఛెళ్లుమనేలా, నోళ్లు మూసుకొనేలా ‘కొల్లూరు’ను కండ్లముందు ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యానికి గురిచేసే సౌధాలను నిర్మించి        సగర్వంగా ప్రజల ముందు అసలుసిసలైన సాక్ష్యాన్ని నిలిపింది. చెప్పిందే చేస్తాం.. చేసేదే చెప్తాం అని మరోసారి చాటిచెప్పారు  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.ప్రభుత్వం రాజీపడలేదు

కొల్లూర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ సముదాయం ఓ పట్టణాన్నే తలపిస్తున్నది. దాదాపుగా 60 వేల మంది నివాసానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాం. ఖర్చు విషయంలో ప్రభుత్వం రాజీపడటం లేదు. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాం. సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు ఇది. ఇంతటి ఇల్లు తమ సొంతం అవుతుందని పేదలు జీవితంలో కూడా ఊహించరు. సౌకల సౌకర్యాలతో కూడిన ఇంటిని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు పేదలు తమ గుండెల్లో గూడుకట్టుకుంటారు. 

- మధుసూదన్‌,  సీఈవో, డీఈసీ ఇన్‌ఫ్రా


logo