మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 01:53:13

ఆదర్శంగా శాసనసభ సమావేశాలు

ఆదర్శంగా శాసనసభ సమావేశాలు
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు..
  • బడ్జెట్‌ సమావేశాలపై అధికారులు, పోలీసులతో సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగే తీరు దేశానికే ఆదర్శంగా ఉండాలని, ఇందుకు ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించాలని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు శుక్రవారంనుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ కమిటీహాల్‌లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలను ప్రజలు గమనిస్తుంటారని, సభ సజావుగా జరుగడానికి సభ్యులు, అధికారులు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీసుశాఖ సమర్థవంతమైన పనితీరుతో గత సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగాయన్నారు. ఈసారి కూడా అదేవిధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర రాష్ర్టాలలోని చట్టసభలలో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలు ఇక్కడ జరుగడం లేదని, రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ, మండలి సమావేశాలు విజయవంతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు. 


ఉభయసభలలో చర్చకు వచ్చే అంశాల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభలలో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తుంటారని చెప్పారు. పోలీసు అధికారులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, శాసనసభ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, శాసనమండలి చీఫ్‌విప్‌ బీ వెంకటేశ్వర్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు అంజనీకుమార్‌, మహేశ్‌ భగవత్‌, ఎస్పీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>