e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides నైరుతి రుతురాగం

నైరుతి రుతురాగం

నైరుతి రుతురాగం
  • కేరళను తాకిన నైరుతి పవనాలు
  • రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరణ
  • దక్షిణాదిన ఈసారి భారీవానలు: ఐఎండీ
  • రాష్ట్రంలో పలుజిల్లాల్లో భారీవర్షాలు
  • పలుప్రాంతాల్లో 13 సెం.మీ నమోదు
  • ఉమ్మడి నల్లగొండను ముంచెత్తిన వాన
  • పలు చోట్ల మత్తళ్లు దుంకిన వాగులు

నైరుతి అలా కేరళను తాకిందో లేదో తెలంగాణను తొలకరి పలుకరించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికుడిలో అత్యధికంగా 13.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇప్పటికే సగానికిపైగా నిండిఉన్న చెరువులు మత్తళ్లు దుంకాయి.యాదాద్రి బాలాలయంలోకి వర్షపునీరు చేరింది. రోహిణి కార్తె సగంలోనే తొలకరి పలుకరించడంతో నార్లు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, జూన్‌ 3: రాష్ర్టాన్ని తొలకరి వర్షాలు పలుకరించాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయింది. వరంగల్‌ జిల్లా నడికుడిలో అత్యధికంగా 13.35 సెంటీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో నిర్మల్‌ మినహా అన్ని జిల్లాల్లో వర్షం పడింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది. తెల్లవారుజామునుంచి లాక్‌డౌన్‌ మినహాయింపు సమయం ముగిసే దాకా వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రజలు తీవ్ర
ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడులు దుంకాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. రెండురోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది.

మునుగోడులో ముంచెత్తిన వాగులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల భారీవర్షం కురిసింది.భూదాన్‌పోచంపల్లిలో 13 సెం.మీ, చండూరులో 12 సెం.మీ, గరిడేపల్లిలో 11.4 సెం.మీ వర్షం కురిసినట్టు స్థానిక అధికారులు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి, గుర్రంపోడు మండలాల పరిధిలోని శషిలేటి వాగు ఉధృతంగా ప్రవహించింది. కనగల్‌ వాగును వరద నీరు ముంచెత్తింది. చండూరు పట్టణంలో ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. యాదాద్రి ఆలయ పరిసరాల్లో పోటెత్తిన వరద నీటితో బాలాలయం జలమయమైంది. స్వామి వారికి వరద నీటిలోనే సుప్రభాత సేవలు నిర్వహించారు.

మత్తడిపోసిన ఖమ్మం మున్నేరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. కొణిజర్లలో పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న నర్సింహారావు పిడుగుపాటుకు గురికావడంతో తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద నిర్మించిన మున్నేరు చెక్‌డ్యాం మత్తడి దుంకింది. ఈ చెక్‌డ్యాంను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ పరిశీలించారు. కారేపల్లి మండలంలోని నాగరాజుకట్ట చెరువు నిండి అలుగుపోసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగుపారింది. ఉమ్మడి వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.

మూగ జీవాలు మృత్యువాత

విద్యుదాఘాతంతోపాటు, పిడుగులు పడి మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో 30 పశువులు మృతవాత పడ్డాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామశివారులో గురువారం విద్యుదాఘాతంతో 12 బర్రెలు, 2 ఎద్దులు మృతిచెందాయి. కన్నెపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి రెబ్బెన గ్రామానికి వెళ్లే 11కేవీ విద్యుత్తు లైన్‌ గాలి దుమారానికి కిందపడిపోయింది. మేతకోసం వెళ్లిన పశువులు తీగకు తగిలి మృతి చెందినట్లు స్థ్ధానికులు తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో వర్షానికి విద్యుత్తు తీగలు తెగి నేలపై పడడంతో ఉదయం మేతకోసం వెళ్లిన 14 పాడి గేదెలు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. మునుగోడు మండలం జమస్తాన్‌పల్లిలో పిడుగుపాటు పగిళ్ల యాదయ్య అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు మృతిచెందాయి.

కురవిలో పచ్చని కప్పలు

మహబూబాబాద్‌ జిల్లా కురవిలో గురువారం కురిసిన భారీవర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత వర్షం తెరిపినివ్వడంతో నేరడ క్రాస్‌రోడ్డు వద్ద కాలనీలోని ఖాళీ ప్రదేశంలో వందకుపైగా పెద్ద పసుపుపచ్చని కప్పలు వచ్చి చేరాయి. భారీగా శబ్ధం చేసిన కప్పలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

కేరళలోకి ప్రవేశించిన నైరుతి

నైరుతి రుతుపవనాలు గురువారం దక్షిణ కేరళలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌1న ప్రవేశించాల్సిన రుతుపవనాలు రెండురోజులు ఆలస్యంగా వచ్చాయి. కేరళతోపాటు లక్షద్వీప్‌, దక్షిణ తమిళనాడు, మాల్దీవులు, నైరుతి బంగాళాఖాతంలో కొంతభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 48 గంటల్లో దక్షిణ అరేబియా, మధ్య అరేబియా, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్టల్‌ ఇంటీరియల్‌ కర్ణాటకలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కే నాగరత్న తెలిపారు. రుతుపవాల ఆగమనం, ఉపరితల ద్రోణి కారణంగా శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నైరుతి రుతురాగం

ట్రెండింగ్‌

Advertisement