ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 21, 2021 , 08:23:23

అమ్మ‌కు గుడి క‌ట్టిన కుమారులు..

అమ్మ‌కు గుడి క‌ట్టిన కుమారులు..

వారికి అమ్మే సర్వస్వం. అమ్మంటే ప్రాణం.. అలాంటి మాతృమూర్తి చనిపోతే విలవిలలాడారు. ఆమెను దేవత అని భావించి విగ్రహం చేయించారు.. ప్రతిరోజూ ఆమెను పూజిస్తున్నారు.. మరి ఆ విశేషం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. ఖ‌మ్మం జిల్లాలోని పెద్దమండవ గ్రామానికి చెందిన మన్నెం భారతమ్మ అనే వృద్ధురాలు క్యాన్సర్‌ బారిన పడి 2015లో మృతిచెందింది. దీంతో ఆమె ముగ్గురు కొడుకులు తల్లడిల్లిపోయారు. అమ్మ బతికినంత కాలం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమె లేని లోటు వారిని చాలా బాధించింది. చిన్నకొడుకు సత్యనారాయణ స్వయంగా డాక్టర్‌ కావటంతో అమ్మను బతికించుకోవటానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేశాడు.

పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు, మరో కుమారుడు రామారావు కూడా అమ్మలేని లోటును జీర్ణించుకోలేకపోయారు. చివరికి ముగ్గురూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అమ్మకు గుడికి కట్టించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వరంగల్‌ జిల్లాలోని ఓ శిల్పి వద్దకు వెళ్లి అమ్మ విగ్రహం చేయించారు. గ్రామంలోని తమ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో విగ్రహం పెట్టి ప్రతిరోజూ పూజిస్తున్నారు. ఇంటిల్లిపాదీ ఆమెకు మొక్కి పక్కనే ఉన్న తులసి మొక్కకు నీళ్లు పోస్తారు. భౌతికంగా అమ్మలేని లోటును ఈ కుమారులు ఇలా రోజూ ఆమె విగ్రహాన్ని పూజిస్తూ భర్తీ చేసుకుంటున్నారు.    -ముదిగొండ

VIDEOS

logo