శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 01:43:22

తెలంగాణ సోనా జిందాబాద్‌

తెలంగాణ సోనా జిందాబాద్‌

  • సీఎం మాటను ఆచరించిన రైతన్న
  • పది లక్షల ఎకరాల్లో సోనా వరినాట్లు
  • ప్రభుత్వం సూచించిన విధంగా సాగు
  • మొత్తం సాగులో 75శాతం సన్నాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానాన్ని తెలంగాణ రైతులు తు.చ. తప్పక పాటించారు. వరిలో అధికంగా సన్నాలనే సాగుచేశారు. సన్నాల్లోనూ పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) వేయాలని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాటను ఆచరించి చూపించారు. సరిగ్గా పది లక్షల ఎకరాల్లోనే తెలంగాణ సోనాను సాగుచేసి ప్రభుత్వం మాటపై ఉన్న తమ నమ్మకాన్ని చాటిచెప్పారు. ఈ సీజన్‌లో రైతులు 75% సన్నాలను, 25% దొడ్డు రకాలను సాగుచేసినట్టు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు అధిక విస్తీర్ణంలో వరినాట్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 51.30 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఇందులో 38.30 లక్షల ఎకరాల్లో సన్నరకాలను వేశారు. సన్నాల్లో ఎక్కువగా బీపీటీ 5204 రకాన్ని 16.65 లక్షల ఎకరాల్లో వేయగా.. తెలంగాణ సోనాను 10.01 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. పూజ(అంకూర్‌) 2.36 లక్షలు, జైశ్రీరామ్‌ 2.16 లక్షలు, ఎంటీయూ-1061రకం 1.15 లక్షల ఎకరాల్లో వేశారు. దొడ్డు రకాల్లో ఎంటీయూ 1010 రకాన్ని అత్యధికంగా 9.78 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.88 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా.. సూర్యాపేట జిల్లాలో అధికంగా 3.69 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచేశారు. 

షుగర్‌ బాధితులకు సోనా అన్నం

తెలంగాణ సోనారకం బియ్యంతో వండిన అన్నం షుగర్‌ బాధితులు కూడా తినవచ్చని తేలింది. సాధారణ రకం బియ్యంతో పోల్చితే తెలంగాణ సోనాలో ైగ్లెసినిక్‌ ఇండెక్స్‌ శాతం తక్కువగా ఉంటుంది. సాధారణ రకం బియ్యంలో ైగ్లెసినిక్‌ ఇండెక్స్‌ 70% వరకు ఉండగా తెలంగాణ సోనాలో మాత్రం 51 నుంచి 53% మాత్రమే ఉంటుందని పరిశోధనలో తేలింది. దీంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ తెలంగాణ సోనా బియ్యం రకానికి డిమాండ్‌ పెరిగింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సోనారకం బియ్యానికి బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ ప్రమోషన్‌ బాధ్యతను ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు అప్పగించింది. ఇందుకు సంబంధించి రెండింటి మధ్య ఒప్పందం కూడా కుదిరింది.logo