బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:40

ఉసురుతీసిన క్షణికావేశం

ఉసురుతీసిన క్షణికావేశం

  • సిద్దిపేట జిల్లాలో తండ్రిని చంపిన తనయుడు
  • కొత్తగూడెం జిల్లాలో తండ్రి చేతిలో కొడుకు

మద్దూరు/అశ్వాపురం: రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కారణాలు ఏవైనా క్షణికావేశంలో చంపుకొంటున్నారు.  తాజా గా సిద్దిపేట జిల్లాలో తండ్రిని కొడుకు హతమారిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొడుకును తండ్రి హతమర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జాలపల్లికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి(44) భార్య పద్మ, కొడుకు రామాంజనేయరెడ్డి(19)తో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. పరమేశ్వర్‌రెడ్డి రోజూ తాగి ఇంట్లో గొడవ చేస్తుంటాడు. సోమవారం రాత్రి సైతం తాగి కొడుకుతో గొడవకు దిగాడు. దీంతో రామాంజనేయరెడ్డి తండ్రి కి తాడుతో ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహానికి తీగలు చుట్టి కరంట్‌ షాక్‌తో చనిపోయినట్లు చిత్రీకరించాడు. పోలీసులు రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకొన్నాడు. 

నిద్రిస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన సామ రామిరెడ్డి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సంజీవరెడ్డి(33) దినసరి కూలీ. మద్యానికి బానిసై తల్లిదండ్రులను, భార్యను నిత్యం వేధించేవాడు.  రెండుసార్లు జైలుకు వెళ్లినా మారలేదు. సోమవారం ఉదయం నుంచి తల్లిని కొడుతున్నాడు. కొడుకు ఎప్పటికీ మారడని భావించిన తండ్రి ఎలాగైన మట్టుబెట్టాలనుకున్నాడు. అర్ధరాత్రి వేళ డాబాపై నిద్రిస్తున్న కొడుకును గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు.


logo