మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:49:43

కొడుకుల చేతిలో తండ్రుల హతం

కొడుకుల చేతిలో తండ్రుల హతం

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/రెబ్బెన: కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఒకరు.. తాగివచ్చి తల్లిని హింసిస్తున్నాడని మరొకరు.. బుధవారం కొడుకుల చేతిలో తండ్రులు హతమైన ఘటనలు మంచిర్యాల జిల్లాలో కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లి స్టేజీకి చెందిన దుర్గం ప్రసాద్‌(40) రాపల్లి చర్చిలో ఫాస్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్‌కు భార్య కమల, ప్రణవ్‌రాజ్‌, ప్రణయ్‌రాజ్‌ కుమారులున్నారు. ఏఎన్‌ఎంగా పనిచేసే ప్రసాద్‌ భార్య ఉద్యోగరీత్యా తన ఇద్దరు కుమారులతో కలసి ఖానాపూర్‌లో ఉంటున్నది. వారు 15 రోజులకోసారి రాపల్లికి వస్తుంటారు. అయితే తమతోపాటు తల్లి బాగోగులను పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రణవ్‌రాజ్‌ బుధవారం ఉదయం గొడ్డలితో తండ్రి ప్రసాద్‌ మెడపై నరకడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

అనంతరం హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మరో ఘటనలో తక్కలపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చెందిన బొట్టకుంట భీమయ్య(55) పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. నిత్యం మద్యం తాగి భార్య సత్తక్కతో గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడి కర్రతో దాడి చేసి గాయపరిచాడు. పక్కనే ఉన్న కుమారుడు తిరుపతి కోపంతో తండ్రి భీమయ్యపై చేయిచేసుకోవడంతో మంచంపై పడిపోయాడు. తరువాత తండ్రి మెడకు తాడు కట్టి ఇంటి దూలానికి వేలాడిదీసి హతమర్చాడు. తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు అనూమానంతో విచారించగా తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు.


logo