మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 02:47:31

సింగరేణి ఉద్యోగం కోసం కొడుకు ఘాతుకం

సింగరేణి ఉద్యోగం కోసం కొడుకు ఘాతుకం

  • కొలువు కోసం తండ్రి హతం 
  • నిందితుడికి సహకరించిన తల్లి, తమ్ముడు 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: సింగరేణి ఉద్యోగం కోసం తండ్రినే చంపాడో కొడుకు. పథకం ప్రకారం హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించి..  చివరికి పోలీసులకు దొరికిపోయాడు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన ముల్కల నర్సయ్య(55) రామగుండం ఆర్జీ-1 పరిధిలోని ఫైవిైంక్లెన్‌ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నర్సయ్యకు భార్య తార, కొడుకులు తిరుపతి, రాకేశ్‌ ఉన్నారు. తిరుపతి పాలిటెక్నిక్‌ పూర్తిచేయగా, రాకేశ్‌ ఐటీఐ చదువుతున్నాడు. పెద్దకొడుకు తిరుపతి.. తండ్రి ఉద్యోగంపై కన్నేశాడు.

అనారోగ్య కారణాలతో చనిపోతే కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం పొందవచ్చని ఆలోచించాడు. గత నెల 31న నర్సయ్య ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా, నాలుగు రోజుల ముందు తండ్రి హత్యకు తమ్ముడు రాకేశ్‌, తల్లి తారతో కలిసి పథకం వేశాడు. ముందే అనుకున్న ప్రకారం తల్లికి ఆరోగ్యం బాలేదని తండ్రికి చెప్పి.. తమ్ముడితో గోదావరిఖనిలోని పెద్దమ్మ ఇంటికి పంపించి తాను ఇంటి వద్దే ఉండిపోయాడు. 25న రాత్రి నర్సయ్య ఊళ్లో జరిగిన ఓ విందుకు హాజరై వచ్చి ఇంట్లో నిద్రించగా, 26న తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతి తన తండ్రి గొంతు పిసికి హతమార్చాడు. అనంతరం గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మించాడు. నాలుగు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం సింగరేణి వర్గాలు, గ్రామస్థుల్లో చర్చనీయాంశంగా మారింది. రహస్య సమాచారంతో విచారణ జరిపిన పోలీసులు నర్సయ్య అంత్యక్రియలను నిలిపివేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తిరుపతి, రాకేశ్‌ను అరెస్టు చేయగా, తల్లి తార కోసం గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.


logo