మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 02:37:23

ఫుట్‌పాత్‌పై తల్లి మృతదేహం

ఫుట్‌పాత్‌పై తల్లి మృతదేహం

  • అంత్యక్రియలకు పైసల్లేక వదిలేసిన కొడుకు
  • పేదరికం ముందు తలవంచిన పేగుబంధం
  • కరోనా అనుమానంతో కానరాని బంధువులు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఘటన అయినవారు చనిపోతే ఉన్నంతలో అంత్యక్రియలు నిర్వహించడం మన ఆచారం. కానీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి వృద్ధాప్యంలో అనారోగ్యంతో కన్నుమూస్తే.. పేదరికంతో కనీసం అంతిమసంస్కారాలకు కూడా నోచుకోలేకపోయింది. పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. కరోనా అనుమానంతో బంధువులు స్పందించకపోవడంతో తల్లి అంత్యక్రియలకు డబ్బులతోపాటు మోసేందుకు ‘ఆ నలుగురు’ కరువై మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ఫుట్‌పాత్‌పై పారేశాడో కొడుకు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ జిల్లా వర్ని ప్రాంతానికి చెందిన తలారి భగీరథి (75)కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కొడుకు రమేశ్‌ నెలరోజుల క్రితం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 2లోని షాంగ్రిల్లా ప్లాజాలో వాచ్‌మెన్‌గా చేరి షౌకత్‌నగర్‌లో కిరాయికి ఉంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి భగీరథి అనారోగ్యంతో చిన్నకొడుకు రమేశ్‌ వద్దకు వచ్చింది. అమెకు జ్వరంగా ఉండటంతో కొన్ని మందులు వేసినా తగ్గకపోగా ఆరోగ్యం మరింత విషమించింది. కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో ఇంటి యజమానితోపాటు స్థానికులు కూడా ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ఒత్తిడిచేశారు. శనివారం అర్థరాత్రి భగీరథి కన్నుమూసింది. కరోనా భయంతో అప్పటికే ఎవరూ దగ్గరకు రాకపోవడంతోపాటు అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమీచేయాలో అర్థంకాని ఆయోమయ స్థితిలో రమేశ్‌ స్వగ్రామంలోని బంధువులకు సమాచారం అందించాడు. కరోనాతో చనిపోయిన తల్లి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దని, ఎలాగైనా హైదరాబాద్‌లోనే  అంత్యక్రియలు పూర్తిచేయాలని, తమవద్ద కూడా చిల్లిగవ్వ లేదని సోదరుడితోపాటు బంధువులు తేల్చిచెప్పారు. దాంతో తల్లి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టిన రమేశ్‌ తలకు ప్లాస్టిక్‌ కవర్‌ కట్టాడు. మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకొని తాను ఉంటున్న ఇంటి సమీపంలో లుంబినీమాల్‌ ఎదురుగా ఫుట్‌పాత్‌పై పడేసి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించిన స్థానిలకులు పోలీసులకు సమాచారం అందించారు. రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో ఇలాచేయాల్సి వచ్చిందని బోరున విలపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు తెలిపారు.logo