గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 20:33:52

ఆస్తి కోసం ఇంటికి తాళం వేసి కన్నతల్లిని గెంటేసిన కొడుకు

ఆస్తి కోసం ఇంటికి తాళం వేసి కన్నతల్లిని గెంటేసిన కొడుకు

సారపాక: తొమ్మిది నెలల పాటు మోసింది.. పురిటినొప్పులను భరించి కుమారుడికి జన్మనిచ్చింది.. పెంచి పెద్ద చేసింది..  వృద్ధాప్యంలో  కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న కొడుకు నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. మాతృ దినోత్సవం నాడే ఓ ‘అమ్మ’ ఒంటరిదయ్యింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగు చూసింది. 

వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాకలోని పాత పంచాయతీ రోడ్‌లో అయిలూరి వెంకట కోటమ్మ (70), అయిలూరి రంగారెడ్డి దంపతులు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త రంగారెడ్డి మూడు నెలల క్రితం మృతిచెందాడు. భర్త బతికి ఉన్న సమయంలోనే వెంకట కోటమ్మ కుమార్తెలకు, కుమారునికి పెళ్లిళ్లు చేసింది. కొడుకు ఇంట్లో ఉండకుండా తన సొంత ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నది. 

తన భర్త మరణం తర్వాత తనను చేరదీసి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు అయిలూరి శ్రీనివాసరెడ్డి తరచూ వేధిస్తున్నాడని, ఈనెల 8న తాను ఉంటున్న ఇంటికి వచ్చి చేయిచేసుకున్నాడని, స్థానికులు చేరదీశారని వాపోయింది. సొమ్మసిల్లి పడిపోగా స్థానికుల సాయంతో భద్రాచలంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందానని చెప్పింది. కొడుకుపై ఆదివారం సారపాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఖర్చుల కోసం రూ.36 వేలు తీసుకున్నాడని తిరిగి ఇవ్వలేదని బోరున విలపించింది. తన కుమారుడి వేధింపుల నుంచి కాపాడాలని మౌన పోరాటం చేస్తున్నది. 


logo