శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 00:52:47

కల్లోల కుట్ర

కల్లోల కుట్ర

‘రాజకీయపార్టీల నేతలు ప్రసంగాల్లో రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలపైనా దృష్టి పెట్టాం. వీటిపై న్యాయసలహా తీసుకొని తగిన చర్యలు తీసుకొంటాం. సర్జికల్‌ స్ట్రెక్‌ చేస్తామంటూ కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా కేసులు నమోదుచేస్తాం’ అభ్యంతరకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై నజర్‌ పెట్టాం. ఎవరైనా హద్దుదాటితే ఉపేక్షించేది లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎవరైనా పోస్టులు పెడితే, నకిలీ వార్తలు పెట్టినట్టు గుర్తిస్తే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో తెలియ జేయండి. దయచేసి ప్రజలెవరూ ఆ పోస్టులను ఫార్వర్డ్‌ చేయొద్దు.
-డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విధ్వంసక శక్తులు నగరంలో మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని పక్కా సమాచారం ఉన్నట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరించేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరేండ్లుగా ప్రశాంత వాతావరణంలో ఉన్న తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆసరాగా తీసుకుని కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. సోషల్‌మీడియాలో అభ్యంతరకర, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, పోస్టులు చేస్తున్నవారిపై ఇప్పటికే నజర్‌ పెట్టామని తెలిపారు. ఎవరైనా హద్దుదాటితే ఉపేక్షించేదిలేదని తీవ్రంగా హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తమైనట్టు పేర్కొన్నారు. గురువారం డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోషల్‌మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులతో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టిపెట్టామని చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అభ్యంతరకర పోస్టులను గుర్తించేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నామని, ఇప్పటివరకు 50 మందిపై ఈ తరహా కేసులు నమోదు చేశామని 
 వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎవరైనా పోస్టులు పెట్టినా, నకిలీ వార్తలని గుర్తించినా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని, అలాంటి పోస్టులను ఫార్వర్డ్‌ చేయొద్దని కోరారు. రాజకీయపార్టీల నేతలు ప్రసంగాల్లో రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలపై న్యాయసలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కొందరు నాయకులు సర్జికల్‌ ్రైస్టెక్‌ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా కేసులు నమోదుచేస్తామని పేర్కొన్నారు. ఓయూ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీసూర్యపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. అక్రమంగా భారత పౌరసత్వం పొందేందుకు యత్నించిన 62 మంది రోహింగ్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలపై సమీక్షించినట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. 

గ్రేటర్‌ ఎన్నికకు 51,500 మందితో బందోబస్తు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకొనేలా బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బందోబస్తు కోసం 51,500 మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌, జోనల్‌ ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు.

51,500 మందితో బందోబస్తు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకొనేలా బందోబస్తు ఏర్పాటుచేశాం. ఎన్నికల బందోబస్తు కోసం 51,500 మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నాం. -డీజీపీ మహేందర్‌రెడ్డి


logo