బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 22:55:36

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత

హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని సీఎం తెలిపారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రామలింగారెడ్డి చివరిశ్వాస వరకు ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు.

రామలింగారెడ్డి కుటుంబం యావత్తూ అటు ఉద్యమంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలుపంచుకుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధి కొనసాగడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలుకావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సమంజసమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని స్పష్టంచేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo