బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 07, 2020 , 01:12:13

ఆదర్శాన్ని ఆచరణలో చూపిన నేత

ఆదర్శాన్ని ఆచరణలో చూపిన నేత

  • జర్నలిస్టుగా ఉండి.. ప్రజానేతగా ఎదిగిన లింగన్న
  • విద్యార్థి దశలోనే వామపక్ష సంఘాల వైపు
  • ఉదయం దినపత్రికలో విలేకరిగా ప్రస్థానం 
  • కేసీఆర్‌ పిలుపుతో 2004లో రాజకీయాల్లోకి
  • తుదిశ్వాస వరకూ ప్రజల మధ్యే ఉన్న నేత 
  •  తనది ఆదర్శ వివాహం.. తన పిల్లలకు కూడా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో చిన్నా, పెద్ద.. లింగన్నగా పిలుచుకొనే సోలిపేట రామలింగారెడ్డి నిత్యం ప్రజల మధ్యనే జీవించారు. మండల విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన ఆయన చివరి వరకూ సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లా, దుబ్బాక మండలం, చిట్టాపూర్‌లో 1961, అక్టోబర్‌ 2న జన్మించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు, అల్లుడు, మనుమండ్లు, మనుమరాలు ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన సోలిపేట.. 1985లో నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్‌ సమక్షంలో సుజాతను ఆదర్శ వివాహం చేసుకున్నారు. తనలాగే కుమారుడు సతీశ్‌రెడ్డి, కూతురు ఉదయశ్రీలకు సైతం స్టేజ్‌ మ్యారేజ్‌ చేసి ఆదర్శంగా నిలిచారు. తాను చేరదీసిన అనాథలకు సైతం ఆదర్శ వివాహాలు జరిపించారు. 

విద్యార్థిదశ నుంచే విప్లవాలపై ఆసక్తి

సోలిపేట రామలింగారెడ్డి విద్యార్థి దశ నుంచే విప్లవాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. 1979లో డొనేషన్ల చదువులు వద్దంటూ సాటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు. కళాశాల ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యార్థిదశలో ఆయన పీడీఎస్‌యూ, రాడికల్‌ సంఘాలపట్ల ఆకర్షితులయ్యారు. సాహిత్యాభిలాషి అయిన సోలిపేట దుబ్బాక చరిత్ర, కళాశాలపై అప్పట్లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఉదయం దినపత్రికలో  దుబ్బాక మండల విలేకరిగా రామలింగారెడ్డి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వార్త పత్రికలో స్టాఫ్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ఉన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక

ప్రజా ఉద్యమాల్లో అలుపెరుగకుండా పోరాడిన సోలిపేట దృష్టి 2001లో కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంపై పడింది. నాడు జర్నలిస్టుగా ఉన్న సోలిపేట.. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను కండ్లకు కట్టినట్టు వివరించి ఉద్యమానికి ఊపిరిలూదారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచనలు, సలహాలతో దుబ్బాక నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించారు. మరోపక్క సాహితీవేత్తలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్‌ 2004లో దొమ్మాట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇచ్చారు. సీనియర్‌ లీడర్‌, అప్పటి మంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై 25వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సోలిపేట తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రజల్లోనే ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సోలిపేటపై 100 వరకు పోలీస్‌ కేసులు నమోదైనా ఏనాడు వెనుకంజ వేయలేదు. 2005లో టీడీపీ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు పాదయాత్రను అడ్డుకోవడం, రాజీవ్‌ రహదారి దిగ్బంధం, సిద్దిపేట రంగధాంపల్లిలో కేసీఆర్‌ ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్ష, జైల్‌రోకో తదితర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పోలీసుల అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడిన రామలింగారెడ్డిపై అక్రమ ఆయుధాల కేసు నమోదైంది. దేశంలోనే తొలిసారి ఓ జర్నలిస్టుపై ‘టాడా’ కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన మూడునెలలు జైలుజీవితం గడిపారు. 

నాలుగుసార్లు ఎమ్మెల్యే

రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు పోటీచేసిన సోలిపేట నాలుగుసార్లు విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2004 లో తొలిసారి దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నూతనంగా ఏర్పడ్డ దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన చెరుకు ముత్యంరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 37,925 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018ఎన్నికల్లో దుబ్బాక నుంచి మరోసారి పోటీచేసి, 62,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లింగన్న భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో శాశ్వతంగా జీవించి ఉంటారు.


logo