మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 02:06:40

సోలార్‌వెలుగుల్లో అండర్‌పాస్‌లు

సోలార్‌వెలుగుల్లో అండర్‌పాస్‌లు
  • 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో 165 అండర్‌పాస్‌మార్గాలు
  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రూ.1.90 కోట్లతో విద్యుదీకరణ

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రాజధానికి మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అండర్‌పాస్‌మార్గాలు సోలార్‌ వెలుగులు సంతరించుకోనున్నాయి. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో 165 అండర్‌పాస్‌లున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అవి దేదీప్యమానంగా ధగధగలాడనున్నాయి. జన సంచార ప్రదేశాలు, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ మార్గాల్లో సోలార్‌ లైటింగ్‌ ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. మంత్రి ఆదేశాలతో సుమారు రూ.1.90 కోట్లతో పూర్తిస్థాయిలో విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 62 అండర్‌పాస్‌దారుల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ పూర్తయింది. మిగతాచోట్ల పనులు తుదిదశలో ఉన్నాయి. ఈ నెల మూడోతేదీ (మంగళవారం) నుంచి అన్ని అండర్‌పాస్‌దారుల్లో లైటింగ్‌ వ్యవస్థ పనిచేస్తుందని అధికారులు తెలిపారు.

సోలార్‌ ఆధారిత ఎల్‌ఈడీ వ్యవస్థ 

ఔటర్‌ అండర్‌పాస్‌మార్గాలు రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వాటిని నివారించేందుకు అధికారులు సోలార్‌ ఆధారిత ఎల్‌ఈడీ లైటింగ్‌వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నారు. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్‌, కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్‌చెరు నుంచి గౌడవల్లి మార్గాల మధ్య అండర్‌పాస్‌లో (వీయూపీ/పీయుపీ) ఎల్‌ఈడీ పనులకు రూ.68.60 లక్షలు, మేడ్చల్‌ నుంచి పెద్ద అంబర్‌పేట స్ట్రెచ్‌ పనులకు రూ.68.60 లక్షలు, పటాన్‌చెరు నుంచి పెద్దఅంబర్‌పేటమార్గంలో రూ.71.50 లక్షలతో ఎల్‌ఈడీ లైటింగ్‌ పనులను చేపడుతున్నారు. త్వరలోనే టోల్‌ప్లాజా (ఎంట్రీ/ఎగ్జిట్‌) పాయింట్లలో సీసీ కెమెరాలను బిగించనున్నారు. ప్రతి వాహనదారుడి కదలికలను నానక్‌రాంగూడలోని ఎంటీసీసీ భవనం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రజల భద్రతకు పెద్దపీటవేసి అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టనున్నారు. 

త్వరలో ఓఆర్‌ఆర్‌ వెలుగులమయం

ఇప్పటికే ఔటర్‌లో తొలివిడుతగా రూ.30 కోట్ల జైకా నిధులతో గచ్చిబౌలి-శంషాబాద్‌ 22 కి.మీ మార్గంలో ఎనిమిది లేన్ల మెయిన్‌ కారిడార్‌లోని సెంట్రల్‌ మీడియన్‌లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేశారు. నగరం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని తొలుత ఈ మార్గాన్ని ఎంపికచేశారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో మిగిలిన 136 కిలోమీటర్ల మార్గంలో ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్‌దశలో ఉన్నది. ఇది కూడా పూర్తయితే 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ వెలుగులమయం కానున్నది.


అద్భుతంగా అండర్‌పాస్‌లు అధికారుల పనితీరును మెచ్చుకున్న మంత్రి కేటీఆర్‌ 

‘165 అండర్‌ పాస్‌మార్గాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి లైట్లు పనిచేస్తాయి’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్వీట్‌చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా పోస్టుచేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని అండర్‌పాస్‌లను అధికారులు ఎల్‌ఈడీ లైటింగ్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ చీకటి ప్రదేశాల్లో లైటింగ్‌ ఏర్పాటుచేయాలి’ అని అధికారుల పనితీరును మెచ్చుకుంటూ రీ ట్వీట్‌చేశారు.


logo