మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:46:17

కరోనా సెలవుల్లో కలుపుతీత యంత్రం

కరోనా సెలవుల్లో కలుపుతీత యంత్రం

  • రూ.4 వేలతో సోలార్‌తో రూపకల్పన 
  • ప్రైవేట్‌ పాఠశాల యజమాని ఆవిష్కరణ

మంచిర్యాల అగ్రికల్చర్‌: సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి పాఠశాల నిర్వాహకుడిగా మారిన ఓ విద్యావంతుడు కరోనా సెలవుల్లో ఖాళీగా ఉండకుండా పత్తిలో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసేవారు. 2003లో ఆ ఉద్యోగాన్ని వదిలి 17 మంది విద్యార్థులతో ఒక ప్రైవేట్‌ పాఠశాల (స్లేట్‌ హైస్కూల్‌)ను జన్నారంలో ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా పాఠశాల మూసివేశారు. దీంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం మొదలు పెట్టారు.

తక్కువ ఖర్చులో కలుపుతీసే యంత్రం తయారీకి శ్రీకారం చుట్టారు. చిన్న పిల్లల బ్యాటరీ కారులోని 12 వోల్ట్స్‌, 40 వాట్స్‌, 2500 ఆర్‌ఫీఎం గల రెండు మోటర్లు, సైకిల్‌ బేరింగ్‌, చైన్‌ను వాడి యంత్రాన్ని రూపొందించారు. అదనంగా ఒక బ్యాటరీ ఏర్పాటు చేశారు. లోడ్‌ కంట్రోల్‌ కోసం ఒక స్విచ్‌, వోల్ట్‌ మీటర్‌(బ్యాటరీ డిశ్చార్జీ తెలుసుకునేందుకు), బ్యాటరీ చార్జింగ్‌ కోసం సోలార్‌ ప్యానల్‌ వాడారు. ఈ బ్యాటరీ ఒకసారి చార్జీ చేస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దీనితో ఎకరం కలుపు తీయవచ్చనీ, యంత్రానికి కేవలం రూ.4 వేలు మాత్రమే ఖర్చయ్యిందని ఆయన చెప్పారు. కొత్త పరికరాలను ఉపయోగించి యంత్రం తయారు చేస్తే సుమారు రూ.12 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని శ్రీకాంత్‌రెడి తెలిపారు.logo