శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 20:02:30

అండర్‌పాస్‌ల వద్ద సోలార్‌ విద్యుత్‌ దీపాలు..

అండర్‌పాస్‌ల వద్ద సోలార్‌ విద్యుత్‌ దీపాలు..

హైదరాబాద్‌: నగరంలోని ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని అండర్‌పాస్‌ల వద్ద సోలార్‌ ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పట్టణ శివారులోని 165 అండర్‌పాస్‌ల వద్ద సోలార్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 3న సోలార్‌ లైట్లను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దిశా హత్యాచార ఘటన జరిగిన అనంతరం.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, టోల్‌ప్లాజాల వద్ద లైటింగ్‌ లేని ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశామని తెలిపిన ఆయన.. 165 అండర్‌పాస్‌ల వద్ద కూడా లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

అండర్‌పాస్‌ల వద్ద చీకటిగా ఉండడంతో కొన్ని అసాంఘీక శక్తులు.. దుశ్చర్యలకు పాల్పడుతున్నాయనీ.. వాటిని అరికట్టడం, ప్రయాణిల సౌలభ్యం కోసం ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, అన్ని పురపాలికల్లోనూ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 


logo