గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:08

నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లు

నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లు

  • రిజర్వాయర్లలో ఏర్పాటుకు సింగరేణి యోచన
  • 500 మెగావాట్ల ఉత్పత్తికి ప్రతిపాదనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/శ్రీరాంపూర్‌/ జైపూర్‌: సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగా భారీ  జలాశయాల మీద తేలియాడే సోలార్‌పవర్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం సిద్ధమవుతున్నది. తొలిదశలో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యం గల తేలియాడే సోలార్‌ప్లాంట్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ రెడ్కో) సాయంతో సింగరేణి ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై అధికారులు ఓ అధ్యయనం చేశారు. ఈ నివేదికను సోమవారం సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు అందజేశారు. ఒకేచోట నిర్మించవచ్చా? లేదా 100 మెగావాట్ల సామర్థ్యంలో వేర్వేరుచోట్ల నిర్మించాలా? అన్న అంశంపై చర్చించారు. ఇందుకోసం కరీంనగర్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో అనుకూలంగా ఉన్న భారీ జలాశయాల గురించి వివరించారు. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శ్రీధర్‌ తెలిపారు. విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించిన అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ ఎస్‌ శంకర్‌, టీఎస్‌రెడ్కో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.logo