శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 18, 2021 , 19:55:49

సౌర విద్యుత్‌లో హైద‌రాబాదీలు భేష్!

సౌర విద్యుత్‌లో హైద‌రాబాదీలు భేష్!

హైద‌రాబాద్‌: స‌హ‌జ వ‌న‌రులు త‌రిగిపోతున్నాయి... వాటితో త‌యారైన ఇంధ‌నం వాడ‌కం ఎలా ఉన్నా కాలుష్యంతో భూతాపం పెరిగిపోతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల పురోగ‌తిపై అంతా కేంద్రీక‌రించారు. అందులో ఒక‌టి సౌర విద్యుత్‌. కేవ‌లం ఎత్తైన ప్ర‌దేశాల్లో ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే సౌర విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఇండ్ల‌పైనా ప్యానెళ్లు ఏర్పాటు చేయొచ్చు. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మారుపేరుగా నిలిచిన తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ వాసులు కూడా సౌర విద్యుత్ వాడ‌కంపై ఆస‌క్తి పెంచుకుంటూ ఆ దిశ‌గా క్ర‌మంగా అడుగులేస్తున్నారు. 

శివారుల్లో సౌర విద్యుత్‌పై ఆస‌క్తి

గ్రేటర్‌ హైదరాబాద్‌  శివారు ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పట్ల వినియోగ‌దారుల్లో ఆస‌క్తి ఎక్కువైంద‌ని  టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. మేడ్చల్‌  సర్కిల్‌ పరిధిలో 19.6 మెగావాట్లు, రాజేంద్రనగర్‌ పరిధిలో 16.12 మెగావాట్లు, హబ్సిగూడలో 16.02, సైబర్‌ సిటీ( ఐటీ కారిడార్‌)లో 11.3 మెగావాట్ల  సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

రోజూ 150 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తి

ప్ర‌ధాన న‌గ‌రంతోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ కొత్తగా చేపడుతున్న నిర్మాణాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో ఉన్న 9 సర్కిళ్లలో ప్రస్తుతం 7300 సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ మీటర్లు ఉండగా, వాటి ద్వారా ప్రతి రోజు 100 నుంచి 150 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. దీంతో ప్రతి నెలా సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్ల కోసం కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తికి ప్రోత్సాహాలు

4-5 ఏండ్ల క్రితం 1కిలో వాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.లక్ష ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.35-40వేలకే 1కిలో వాట్‌ ఉత్పత్తి అవుతున్నది. దీంతో  ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు రూ.2 నుంచి 3వేలు చెల్లించే వారు. ఇండ్ల మీద 3కిలో వాట్‌ సామర్థ్యంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మ‌రోవైపు తెలంగాణలో సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేస్తున్నది. 2020లో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లులోకి తెచ్చింది.

సింగిల్ ఫేజ్‌లో 5 కిలోవాట్ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం

2020 మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం గృహ వినియోగదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం సౌర‌‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా అవసరమైన  సౌర‌‌ ప్యానళ్లను ఏర్పాటు చేసి, దాన్ని గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతరులకు 80 శాతం మాత్రమే సౌర‌‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. సింగిల్‌ ఫేజ్‌ వినియోగదారుడు 5కిలో వాట్స్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

నివేదిక మేర‌కే సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి అనుమ‌తి

ఇండ్ల మీద సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలనుకునే వారు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అటుపై  అధికారులు ఆ ఇంటి ప్రాంతాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాల(ఫిజిబిలిటీ)పై రిపోర్టు ఇస్తారు. దీని ఆధారంగా ఎంత మొత్తంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందో దానికి మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత సంస్థ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్‌ ఏజెన్సీలు ఇండ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసి నెట్‌ మీటరింగ్‌కు అనుసంధానం చేస్తాయి. దీంతో విద్యుత్‌ సంస్థ సరఫరా చేస్తున్న విద్యుత్‌తోపాటు సోలార్‌ ద్వారా వస్తున్న విద్యుత్‌ను నెట్‌ మీటరింగ్‌లో గుర్తించేలా చేస్తారు. సోలార్‌  రూఫ్‌టాప్‌ ద్వారా ఉత్పత్తి  అయిన విద్యుత్‌ను తగ్గించి మిగతా దానికే బిల్లు వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo