మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:59:08

21న సూర్యగ్రహణం

21న సూర్యగ్రహణం

  • ఈ ఏడాదిలో అతిపెద్దది
  • జ్వాలా వలయరూపంలో ఆకాశంలో అద్భుతం
  • రాష్ట్రంలో ఉదయం 10.14 గంటల నుంచి
  • 3 గంటలపాటు గ్రహణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాదిలో అతిపెద్ద తొలి సూర్యగ్రహణం ఈనెల 21న ఏర్పడనున్నది. ఖగోళ పరిణామ ఫలితంగా ఈ గ్రహణం జ్వాలావలయ రూపంలో కనువిందు చేయనున్నది. మనదేశంలో ఆదివారం ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:28 గంటలకు ముగుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాష్ట్రంలో 10.14 గంటలకు మొదలవుతుందని తెలిపారు. సూర్యునికి, భూమికి మధ్యలోకి పూర్తిగా చంద్రుడు వస్తే సంపూర్ణ సూర్యగ్రహణంగా.. కొంతమేర వస్తే పాక్షికమైనదిగా పిలుస్తారు. ఈ నెల 21న సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగారావడంతో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఒక్కోసారి సెకను కన్నా తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు. జ్వాలావలయ సూర్యగ్రహణం ప్రతి 16 ఏండ్లకోసారి వస్తుందని, దీని ప్రభావం పలు నక్షత్రాలు, రాశుల వారిపై ఉంటుందని జ్యోతిషులు తెలిపారు. 2019 డిసెంబర్‌ 26న వచ్చిన సూర్యగ్రహణ సమయం నుంచి  ప్రపంచంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైందని చెప్పారు. జూన్‌ 21న ఏర్పడనున్న ఈ గ్రహణంతో వైరస్‌ వ్యాప్తి నిలిచిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణలో సూర్యగ్రహణం ఉదయం 10:14కు మొదలై మధ్యాహ్నం 3.28  గంటలకు ముగుస్తుంది.


logo