శనివారం 11 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:18:12

నేడు సూర్యగ్రహణం

నేడు సూర్యగ్రహణం

  • రాష్ట్రమంతటా మూతపడిన ఆలయాలు
  • కాళహస్తిలో దర్శనాలు యథాతథం
  • మధ్యాహ్నం 3 గంటల తర్వాత సంప్రోక్షణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాదిలో అతిపెద్ద తొలి సూర్యగ్రహణం నేడు ఏర్పడనున్నది. తెలంగాణలో ఉదయం 10.14 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.44 వరకు ఉంటుంది. సూర్యునికి, భూమికి మధ్యలోకి పూర్తిగా చంద్రుడు వస్తే సంపూర్ణ సూర్యగ్రహణంగా.. కొంతమేర వస్తే పాక్షికమైనదిగా పిలుస్తారు. ఆదివారం.. సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగావస్తుండటంతో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ పరిణామ ఫలితంగా ఏర్పడే ఈ జ్వాలావలయ సూర్యగ్రహణం 16 ఏండ్లకోసారి వస్తుందని, దీని ప్రభావం పలు నక్షత్రాలు, రాశుల వారిపై ఉంటుందని జ్యోతిషులు తెలిపారు. గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టు, బాసర, అలంపూర్‌, కొమురవెల్లి తదితర ఆలయాలను శనివారం రాత్రి మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సంప్రోక్షణ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంతసేవ అనంతరం మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత తెరువనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏపీలో మరో సుప్రసిద్ధశైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని గ్రహణసమయంలోనూ యథాతథంగా తెరిచి ఉంచుతామని ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రహాలకు అతీతుడైన కాళహస్తీశ్వరుడి భక్తుల కోసం ఆదివారం మహాలఘదర్శనాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.

లలితాపీఠంలో మహాభైరవయాగం

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పిస్తూ ఆదివారం సూర్యగ్రహణ సమయంలో మహాభైరవయాగం నిర్వహిస్తున్నట్టు సిద్ధేశ్వరి పీఠం తెలిపింది. సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి ఆశీస్సులతో విశాఖ లలితాపీఠంలో ఆదివారం ఉదయం 10.14 నుంచి మధ్యాహ్నం 1.40 వరకు అష్టభైరవ సహిత మహాభైరవ మంత్రసాధన, అర్చన, యాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రహణ సమయంలో సూర్య భగవానుని మెప్పించే ప్రయత్నంలో భాగంగా గాయత్రీ మహా మంత్ర జపం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గాయత్రీ ఉపాసన సంస్థ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మహావాది తెలిపారు. గ్రహణ సమయంలో గాయత్రీ ఉపాసకులు మానవాళి మేలు కోరుతూ మంత్ర జపం చేయాలని కోరారు. logo