సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 01:03:06

సోషల్‌ వ్యాక్సినే మార్గం

సోషల్‌ వ్యాక్సినే మార్గం

నిర్లక్ష్యం వల్లే కేసుల్లో పెరుగుదల: సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం మన ముందున్న ఏకైకమార్గం సోషల్‌ వ్యాక్సిన్‌ అని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. ‘వ్యక్తిగత శుభ్రత, చేతులు తరుచూ కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం’ అన్నింటినీ కలిపి సోషల్‌ వ్యాక్సిన్‌గా ఆయన అభివర్ణించారు. మనం ఇప్పుడు కఠిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. వ్యాక్సిన్‌ రావడం సుదీర్ఘ ప్రక్రియఅని, ఆ లోగా సోషల్‌వ్యాక్సిన్‌ పాటించి వైరస్‌బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. అదేసమయంలో కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా.. అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించారు. ‘మనకేం కాదులే’ అన్న నిర్లక్ష్యం చాలామందిలో కనిపిస్తున్నదని, ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తనవల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. వైరస్‌ వ్యాప్తికి కేవలం ప్రభుత్వాలనే నిందించడం సరికాదన్నారు. మహమ్మారి విజృంభణలో ప్రజల తప్పు కూడా 30 శాతం ఉన్నదని తెలిపారు. నాలుగైదు నెలలుగా కరోనాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యసిబ్బందికి ఊపిరితీసుకునే సమయం ఇవ్వాలని, వారిపై పనిఒత్తిడి తగ్గించేలా వ్యవహరించాలని ప్రభుత్వాలు, ప్రజలకు సూచించారు. 


logo