సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:07:24

హరితహారం సామాజిక బాధ్యత : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హరితహారం సామాజిక బాధ్యత : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి : హరితహారం సామాజిక బాధ్యతగా భావించి ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 విడుతల్లో సుమారు 182 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. 6వ విడుతలో 60 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటి సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆ మొక్కలను ఇంటి ఆవరణలో నాటి తమ తమ పేర్లు పెట్టుకొని సంరక్షించాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానంలో రైతులకు ప్రభుత్వ సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలిపారు. మన జిల్లాలో 2,75,829 ఎకరాల్లో సాగు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కందుల సాగు పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


కరోనా సమయంలోనూ రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.6,886 కోట్లు జమ చేశామన్నారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో నీటి సమస్య ఉండదన్నారు. అదనంగా 46,055 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రభుత్వం రూ.312 కోట్లతో 19 చెక్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,  ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు,  కలెక్టర్ సిక్తా పట్నాయక్, రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్, జడ్పీ సీఈఓ గీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.logo