గురువారం 16 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 10:37:24

35 ఎకరాల్లో స్నేక్స్‌ రెస్క్యూ సెంటర్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

35 ఎకరాల్లో స్నేక్స్‌ రెస్క్యూ సెంటర్:  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్నేక్ రెస్క్యూ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..35 ఎకరాల్లో స్నేక్‌ రెస్క్యూ సెంటర్‌ (సర్పాల పునరావాస కేంద్రం)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ఏరియాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఎక్కడైనా పాము కనిపిస్తే స్నేక్‌ సొసైటీకి సమాచారం ఇవ్వాలి. అరగంటలో ఘటనాస్థలానికి చేరుకుని పాములు పట్టుకుని వెళ్తారు.ఎవరికైనా పాములు పట్టుకోవాలనిపిస్తే శిక్షణ ఇస్తారన్నారు. నిర్మల్‌లో కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. నెల రోజుల్లో కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 20 నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుందని అన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి..జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.‌ బౌరంపేట రిజర్వు ఫారెస్ట్ లో రూ.1.40 కోట్ల వ్య‌యంలో ఏర్పాటు చేసిన సర్పాల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రారంభించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ.. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.  పర్యావరణాన్ని కాపాడ‌టం ప్రతి ఒక్కరి భాద్యత అని తెలిపారు. 

జీవవైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతలే ప్రధానంగా తోడ్పడుతాయన్నారు.  ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయన్నారు.  జీవ‌వైవిధ్య  చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయని, పాములు నాశనమైతే ఎలుకలు, క్రిమి కీటకాలు సంతతి అనుహ్యంగా పెరిగిపోతుందని చెప్పారు. దానితో అవి పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయని అందుకే సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరమ‌న్నారు. 

జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా స‌ర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణ, అలాగే వివిధ రకాల సర్పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉయోగపడుతుందని తెలిపారు.

ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్  (HoFF) ఆర్. శోభ,  పీసీసీఎఫ్ మునీంద్ర‌, మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, అద‌న‌పు పీసీసీఎఫ్ లు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కుక్రేటి, మేడ్చ‌ల్ డీఎఫ్ వో సుధాక‌ర్ రెడ్డి,  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.logo