ధైర్యాన్ని ప్రదర్శించిన రాజయ్య
గన్నేరువరం, జూలై 31: ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని ఓ పాము దారివెంట వెళ్తున్న వృద్ధుడి కాళ్లను చుట్టుకొన్నది. అతడు ఏమాత్రం బెదరకుండా దానిని పట్టుకొని నేలకేసి బాది చంపేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపెల్లిలో శనివారం చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన రాజయ్య (65) ఓ వీధిలో నడుస్తుండగా హఠాత్తుగా ఓ పాము (జెర్రిపోతు) అతడి కాళ్లను చుట్టేసింది. వెంటనే తేరుకున్న రాజయ్య ధైర్యంగా పాము తలను గట్టిగా పట్టుకోగా, అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాము తోకను కాళ్లనుంచి విడదీశాడు. ఆ వెంటనే రాజయ్య దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్గా మారింది.