ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 18:02:38

నార్లాపూర్‌, ఎల్లూరు లిఫ్ట్‌ను ప‌రిశీలించిన స్మితా స‌బ‌ర్వాల్‌

నార్లాపూర్‌, ఎల్లూరు లిఫ్ట్‌ను ప‌రిశీలించిన స్మితా స‌బ‌ర్వాల్‌

నాగర్‌కర్నూల్ : నీటమునిగిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్  పంప్ హౌస్ లోని నీటిని త్వరితగతిన తోడి పోసి మోటార్లను బాగు చేయించటంతో పాటు ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్త‌కుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ ఇంచార్జి కార్యదర్శి స్మితా సబర్వాల్  అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం, ఏల్లూరు సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్‌ను సందర్శించి మునిగిపోయిన పంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖ అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో మాట్లాడుతూ సంఘటన జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ మొత్తం సంఘటనపై సమగ్రంగా విశ్లేషణ చేసి ఒక నివేదిక ఇవ్వాలని నీటిపారుదలశాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డికి సూచించారు. ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌ కలెక్టర్ల‌కు సూచించారు. నీటిపారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి మాట్లాడుతూ పంప్ హౌస్ లోకి వచ్చిన నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇప్పటివరకు 10 మీటర్ల మేర నీటిని తోడిన‌ట్లు ఇంకా 30 మీటర్ల మేర నీరు ఉందని దానిని కూడా సాధ్యమైనంత త్వరలోనే పంపింగ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.


అనంతరం స్మితా స‌బ‌ర్వాల్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అదేవిధంగా తాగునీటి కోసం ఏల్లూరు రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా అంజనగిరి రిజర్వాయర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఏలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం ప్రాతిప‌దిక‌న చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. సున్న టీఎంసీ వద్ద కూడా తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.