ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:08

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూంలు

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూంలు

  • పంద్రాగస్టు నాటికి 23 డిజైన్లలో 4,696 సిద్ధం
  • 139 పట్టణాల్లో 7,685 పబ్లిక్‌ టాయిలెట్లు అవసరం
  • ఇప్పటికే 2,989 నిర్మాణం

పట్టణాల్లోని ముఖ్య వాణిజ్య రహదారుల్లో స్మార్ట్‌ వాష్‌రూములు హైదరాబాద్‌లోని లూకేఫ్‌ల తరహాలో ఉంటాయి. మున్సిపల్‌ కమిషనర్ల సాయంతో షీ టాయిలెట్లు, స్టాండ్‌ ఎలోన్‌, కమ్యూనిటీ టాయిలెట్ల డిజైన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది పంద్రాగస్టు నాటికి మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ప్రజల అవసరాల మేరకు 4,696 స్మార్ట్‌ వాష్‌రూములను పూర్తిచేయాలని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం జీవో జారీచేశారు. పురపాలకశాఖ ఖరారుచేసిన 23 రకాల డిజైన్ల ఆధారంగా పట్టణాల్లో అతివేగంగా స్మార్ట్‌ వాష్‌రూముల నిర్మాణాన్ని పూర్తిచేయాలని తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్థానిక పరిస్థితులు, జనాభా అవసరాలకు లోబడి డిజైన్లను వినియోగించుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ మినహా 139 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సుమారు 77 లక్షల మంది జనాభా ఉండగా.. 7,685 పబ్లిక్‌ టాయిలెట్ల ఆవశ్యకత ఉన్నట్లు పురపాలక శాఖ గుర్తించింది. ఇప్పటివరకూ 2,989 మరుగుదొడ్లు అందుబాటులో ఉండగా.. అదనంగా మరో 4,696 టాయిలెట్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


పీపీపీ విధానంలో..

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో పట్టణాల్లోని ముఖ్య వాణిజ్య రహదారుల్లో స్మార్ట్‌ వాష్‌రూములను ఏర్పాటుచేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. అవి హైదరాబాద్‌లోని లూకేఫ్‌ల తరహాలో ఉండాలని తెలిపింది. పట్టణాల్లోని మున్సిపల్‌ కమిషనర్ల సాయంతో షీ టాయిలెట్లు, స్టాండ్‌ ఎలోన్‌, కమ్యూనిటీ టాయిలెట్ల డిజైన్లను జిల్లా కలెక్టర్లు ఖరారుచేయాలని సూచించింది. ఇప్పటికే సీడీఎంఏ ఖరారుచేసిన డిజైన్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది.


logo