మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 02:30:09

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూములు

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూములు

  • హైదరాబాద్‌ లూకేఫ్‌ తరహాలో ఏర్పాటు
  • అందులోనే ఏటీఎం, కేఫ్‌, కియోస్క్‌ కూడా 
  • సీఎం కేసీఆర్‌ ఆలోచనకు పురపాలకశాఖ ప్రణాళిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆధునిక పట్టణాల్ని ఆవిష్కరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణం గా.. పురపాలక శాఖ స్మార్ట్‌ వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌లోని ‘లూకేఫ్‌'ల తరహాలో వచ్చే మూడునెలల్లో అన్ని పట్టణాల్లో వీటిని ఏర్పా టు చేసేందుకు సిద్ధమవుతున్నది. దానిలో కేవలం బాత్‌రూమే కాకుండా ఏటీఎం, కేఫ్‌, కియోస్క్‌ (చిన్నపాటి దుకాణం), వీలైతే మీ-సేవ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ప్రతి పట్టణంలో స్మార్ట్‌ వాష్‌రూమ్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మున్సిపల్‌ కమిషనర్లను ఇప్పటికే ఆదేశించా రు. వాష్‌రూమ్‌ల నిర్మాణానికి అనువైన ప్రాం తాలు, జనాభా ప్రాతిపదికన నిర్మించాల్సిన వాటి సంఖ్యపై ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలని సూచించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో భాగస్వాములయ్యేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. 

ఎలాంటి స్థలం ఎంపిక?

ప్రభుత్వ జాగల్లోనే స్మార్ట్‌ వాష్‌రూమ్‌లను ఏ ర్పాటుచేయాలని పురపాలకశాఖ భావిస్తున్న ది. దాతలు స్థలమిచ్చినా తీసుకుంటారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా వాటి ఏర్పా టుకు మూడు ప్రత్యామ్నాయాలు రూపొందించారు.

1.ఫుట్‌పాత్‌లో ముందు భాగాన్ని వదిలి వెనుకవైపు ఏర్పాటు చేయడం. ఇది ప్రభుత్వ స్థలంలోనే సాధ్యమవుతుంది. 

2.ఫుట్‌పాత్‌పైనే రెండంతస్తులు నిర్మించి, కింది భాగాన్ని పాదచారులకు వదిలివేయడం.

3.బస్టాపులపై మొదటి అంతస్తులో కట్టడం.వీటికి స్థానిక మున్సిపాలిటీ నీటిని సరఫరా చేస్తుంది. విద్యుత్‌ బోర్డు కరంట్‌ ఇస్తుంది.

రోల్‌ మోడల్‌గా పట్టణాలు

ప్రతి పట్టణాన్ని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్‌ నిర్ణయం. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వచ్చే ప్రజలకు ప్రాథమిక సదుపాయాల్ని కల్పించనున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్‌ వాష్‌రూముల కాన్సెప్టును పురపాలకశాఖ సిద్ధంచేసింది. ఇందుకు సంబంధించిన పనులను ఆరంభించింది. అంతా సవ్యంగా సాగితే, అతిత్వరలో పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూములు ఆవిష్కృతమయ్యే అవకాశమున్నది.


logo
>>>>>>