e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home Top Slides జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ

జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ

జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ
  • మంత్రి కేటీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ
  • జోరుగా మౌలిక వసతుల అభివృద్ధి
  • 8,317 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన
  • సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక

పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలోని పట్టణాల్లో వెలుగు మొలకలు మొలిపించింది. పదిరోజుల పాటు ఉద్యమస్ఫూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచింది. ముఖ్యంగా దళితవాడలు కళకళలాడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన ప్రారంభమైంది. పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎనిమిదివేల పైచిలుకు దళిత బస్తీల్లో అధికారులు పదిరోజుల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.

హైదరాబాద్‌, జూలై 11 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని దళిత బస్తీలు కొత్త శోభను సంతరించుకొన్నాయి. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా పెరిగి కళకళలాడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ఎంతో ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు 8,317 దళిత బస్తీల్లో పర్యటించారు. అక్కడ జరిగిన అభివృద్ధి పనుల వివరాలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తూ అధికారులను ముందుకు నడిపించడంతో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూనే.. వేములవాడ, నారాయణపేట వంటి పురపాలికల్లో స్వయంగా పర్యటించి, కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మురుగు కాలువల్లో 13,246 కిలోమీటర్ల మేరకు పూడికను పారిశుద్ధ్య కార్మికులు తొలిగించారు. రోడ్లపై మట్టి, మొరం పోసి నీరు నిల్వ ఉండకుండా చేశారు. దాదాపు 31 వేల టన్నుల చెత్తను తొలగించారు. దోమలు వ్యాపించకుండా ఫాగింగ్‌ చేశారు.

- Advertisement -

మెరుగైన మౌలిక వసతులు
దళిత బస్తీల్లో అధికారులు రోడ్డు సౌకర్యం, తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువలు, వైకుంఠధామాలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. వీరు సమర్పించే నివేదికపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నది. దీంతో రానున్న రోజుల్లో దళిత బస్తీలు మరింత మెరుగుపడనున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్ల పనులను వేగవంతం చేశారు. భూములను గుర్తించి వాటిని చదునుచేసేందుకు టెండర్లు ఖరారుచేశారు. ప్రజలందరికి ఒకేచోట కూరగాయలు, మాంసం, పూలు, పండ్లు లభ్యమయ్యేలా చూసేందుకు ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. 25 వేల జనాభా ఉన్న 57 పట్టణ స్థానిక సంస్థలకు రూ.2 కోట్ల చొప్పున రూ.114 కోట్లు.. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 81 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక్కో మార్కెట్‌కు రూ.4.731 కోట్ల చొప్పున రూ.383 కోట్లు వెచ్చించాలని నిశ్చయించి మొత్తం 149 మార్కెట్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. వీటి నిర్మాణం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తికానున్నది.

బృహత్‌ పట్టణ ప్రకృతి వనాలు
పెరుగుతున్న జనాభాతో కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారుతున్న పట్టణాల్లో ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో వేసిన లేఅవుట్లు, వెంచర్లలోని ఓపెన్‌ స్పేస్‌ను సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి పట్టణంలో బృహత్‌ పట్టణ ప్రకృతివనం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించడంతో ఆ స్థలాలను పార్కులుగా మార్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. కనీసం 5 నుంచి 10 ఎకరాల స్థలంలో బృహత్‌ పట్టణ ప్రకృతి వనాన్ని, 5 ఎకరాలలోపు ఖాళీ స్థలం ఉన్న పట్టణాల్లో ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటికి స్థలాలను గుర్తించే ప్రక్రియను పట్టణ ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేశారు. బృహత్‌ పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు 77 స్థలాలను (492 ఎకరాలను), పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు 142 స్థలాలను (178 ఎకరాలను) గుర్తించారు. వీటిని చదునుచేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.

పెద్ద ఎత్తున ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం
పట్టణాల్లో ప్రతి 1,000 మందికి కనీసం ఒక ప్రజా మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా మరుగుదొడ్లను నిర్మిస్తున్నది. జనాభా లెక్కలకు అనుగుణంగా రాష్ట్రంలోని పట్టణాల్లో 7,683 ప్రజా మరుగుదొడ్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 4,970 మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 3,966 ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. మరో 152 నిర్మాణంలో ఉన్నాయి.

వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభం
గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున వైకుంఠధామాలను నిర్మించడంకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించి టెండర్లను కూడా పిలిచారు. ఇప్పటికే కొన్ని వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన నిర్మాణాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 141 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో 1,333 శ్మశానవాటికలున్నాయి. వీటిలో 236 శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధిచేయాలని నిర్ణయించారు. 163 వైకుంఠధామాలకు వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే అనుమతులిచ్చారు. వీటి నిర్మాణం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కానున్నది. మరోవైపు వైకుంఠధామాలకు వైకుంఠ రథాలను కొనుగోలుచేయాలని నిశ్చయించారు. ఇప్పటికి 60కిపైగా వాహనాలను కొన్నారు.

ప్రతి నెలా రూ.112 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా హైదరాబాద్‌కు రూ.59 కోట్లు, ఇతర పట్టణాలు, నగరాలకు రూ.53 కోట్లు విడుదలచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.1,344 కోట్లు విడుదల చేయనున్నాయి. వీటిలో ఇప్పటికే రూ.336 కోట్లు విడుదలయ్యాయి. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో పట్టణాలు, నగరపాలక సంస్థలకు కలిపి రూ. 1,875 కోట్లను విడుదల చేశారు. పట్టణ ప్రగతికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 501 కోట్లు, 2020-21లో రూ.1,191 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.265 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నిధులు తగ్గించడంతో ఆ మేరకు పట్టణాలకు నిధులు విడుదల తగ్గింది.

చెత్త తరలింపునకు రెండువేల వాహనాలు
పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యం కోసం కొత్తగా 1,981 వాహనాలను కొనుగోలు చేశారు. వీటిని 141 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో వినియోగిస్తున్నారు. గతంలో ఉన్న 2,628 వాహనాల ద్వారా రోజుకు 2,397 టన్నుల చెత్తను తరలించేవారు. కొత్త వాహనాల కొనుగోలుతో చెత్త తరలింపు సామర్థ్యం 4,295 టన్నులకు పెరిగింది. ప్రస్తుత పట్టణ ప్రగతిలో 31 వేల టన్నుల చెత్తను తొలగించారు.

గ్రీన్‌బెల్ట్‌ వే.. ఓఆర్‌ఆర్‌… మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన హరితహారం కండ్లముందు అద్భుత ఫలితాలను సాక్షాత్కరిస్తున్నది. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన నెహ్రూ ఔటర్‌రింగ్‌ రోడ్‌ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో కళకళలాడుతున్నది అంటూ మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘హరితహారం కార్యక్రమంతో తెలంగాణ గ్రీన్‌మిషన్‌లో ఉన్నది. ఈ సందర్భంగా ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉన్నది. హెచ్‌ఎండీఏ, ప్రభుత్వ చర్యలతో 159 కిలోమీటర్ల హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు, దాని 19 ఇంటర్‌చేంజెస్‌ గ్రీన్‌బెల్ట్‌ వేగా మారిపోయాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన 2.08 నిమిషాల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ
జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ
జబర్దస్త్‌ బస్తీ.. పట్టణ ప్రగతితో దళిత వాడలు కళకళ

ట్రెండింగ్‌

Advertisement