సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 02:12:14

శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద

శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద

  • డ్యామ్‌కు 89,731 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  • జూరాలకు 85 వేల క్యూసెక్కులు
  • ఆల్మట్టికి 36,186 క్యూసెక్కుల వరద

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు వరద ప్రవాహం స్థిరంగా ఉన్నది. సాయంత్రానికి ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 85 వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 71,418 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటున్నది. శనివారం సాయంత్రానికి డ్యామ్‌కు 89,731 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. 

నిలకడగా గోదావరి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం శనివారం నిలకడగా ఉన్నది. త్రివేణి సంగమం నిండుకుండను తలపిస్తున్నది. ప్రాణహిత నది నుంచి శనివారం సుమారు 98 వేల క్యూసెక్కుల నీరు రాగా, గోదావరి నది 8మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్‌ను ఆనుకొని ప్రవహిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్‌కు 72 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మి బరాజ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.409 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఇక్కడ 24 గేట్లు ఎత్తడంతో 72,900 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేస్తున్నారు. 


logo