ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 10:18:57

ఆరుబయట నిద్రిస్తున్నారా.. జరభద్రం

ఆరుబయట నిద్రిస్తున్నారా.. జరభద్రం

ఎండాకాలం ప్రారంభంలోనే ఎండల తీవ్రత పెరగడంతో రాత్రి వేళల్లో ఇంట్లో ఉక్కపోతను  తట్టుకోలేక ప్రజలు చల్లని గాలి కోసం ఇంటి బయట ఆవరణలో నిద్రించేందుకు ఇష్టపడుతారు. చల్లని గాలికి ఆదమరిచి నిద్రించే సమయంలో అదే అదునుగా చూసి మహిళల మెడలో, ఒంటిపై ధరించిన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే ప్రమాదముంది. కావున వేసవికాలంలో మహిళలు, పురుషులు బంగారు ఆభరణాలు ధరించి ఇంటి బయట, మిద్దెల మీద ఆదమరిచి నిద్రించరాదని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా సెల్‌ఫోన్స్‌ చార్జింగ్‌ పెట్టి నిద్రిస్తున్నా.. లేదా తలగడ వద్ద, మంచం పక్కన పెట్టి ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వాటిని ఎత్తుకెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి తలపులు తెరిచి లోపల పడుకోవద్దు. ఇంటిలోపల పడుకున్నప్పుడు లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇంట్లో వారందరూ శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంక్‌ లాకర్లో పెట్టాలి. బీరువా తాళం, ఇంటి తాళాలు వెంటపెట్టుకొని వెళ్లాలి. బంగారు వస్తువులు మెరుగుపెడుతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని నమ్మొద్దు. వెంటనే 100 టోల్‌ప్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఇంట్లో శాంతిపూజలు చేస్తామని పూజలకు బంగారం పెట్టమని మాయగాళ్లు చెబుతారు అలాంటి వారిని నమ్మొద్దు. అలాంటి వారు వస్తే లోకల్‌ పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలి. తక్కువ ధరకు బంగారం ఇస్తామని ముందు చిన్న బంగారు వస్తువు చూపించి తర్వాత నకిలీ బంగారు బిస్కెట్స్‌, నకిలీ వడ్డానాలు, నెక్లెస్‌లు అమ్ముతారు వాటిని నమ్మి మోసపోవద్దు. మీరు నడిచి వెళ్లే దారిలో నకిలీ బంగారం వస్తువును మీరు గమనించేలా పడేసి దానిని గమనించి ఆ వస్తువు వద్దకు వెల్లగానే గుర్తు తెలియని వ్యక్తులు మీ వద్దకు వచ్చి దొరికిన నకిలీ బంగారు వస్తువును నమ్మించి మీ వద్ద ఉన్న నిజమైన బంగారాన్ని వారు తీసుకొని మీకు నకిలీ బంగారాన్ని అప్పజెప్పే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

 వాహనాల పార్కింగ్‌లో..

మీ బైక్‌లు తప్పనిసరిగా తాళలు వేయాలి. ద్విచక్ర వాహనాన్ని భద్రత ఉన్న ప్రదేశంలో పార్కింగ్‌ చేయాలి. ఇంటి బయట పార్కింగ్‌ చేయొద్దు. కనుచూపు మేరలో పార్కింగ్‌ చేసుకోవాలి. బైక్‌ తాళలు అరిగిపోయినట్లయితే వెంటనే కొత్త వాటిని మార్చుకోవాలి. లేకపోతే దొంగలు నకిలీ తాళలతో మీ వాహనాలు దొంగిలించేందుకు అవకాశం ఉంది.

 బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు..

బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకొస్తున్నప్పుడు కింద డబ్బుల నోట్లు వేసి దృష్టిని మళ్లించి డబ్బుల బ్యాగ్‌ దొంగిలిస్తారు. మీ ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ గల తాళం పెట్టించుకోండి. వ్యాపారస్తులు తమ వ్యాపార భవనాల షెటర్లకు, డోర్లకు సెంట్రల్‌ లాక్‌ సిస్టంను ఏర్పాటు చేయించుకోండి. వ్యాపార భవనాల ముందు, లోపల సీసీ కెమెరాలు అమర్చుకోగలరు. వృద్ధులు ఒంటిపై బంగారం ఆభరణాలు ఉన్నప్పుడు వారిని ఒంటరిగా ఇంట్లో ఉంచరాదు. వారిని ఒంటరిగా బయటికి పంపరాదు. ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్తున్నప్పుడు ధరించిన ఆభరణాలు గుర్తుతెలియని వారు వెనక నుంచి, ముందు నుంచి గాని బైక్‌పై వచ్చి మెడలో ఉన్న అభరణాలు లాక్కోని వెళ్లే అవకాశం ఉంది. 

 ఫోన్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకు అధికారులమంటూ మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్లు చెప్పమంటూ అడిగి మీ అకౌంట్‌ హ్యాకింగ్‌ కాకుండా బ్లాక్‌ చేస్తామని కొంతమంది సైబర్‌ నేరగాళ్లు అమాయకుల అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేయడం సాధారణమైంది. బ్యాంకు నుంచి పోన్‌ చేస్తున్నాము ఏటీఎం పిన్‌ నంబర్‌ గానీ ఏటీఎంపై గల నంబర్‌ కానీ లేదా మీ అకౌంట్‌ నంబర్‌ కానీ చెప్పండి అని గర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి అడిగితే చెప్పకూడదు. చెప్పినచో మీ డబ్బులు ఆన్‌లైన్‌లో డ్రా చేసుకుంటారు. ఏటీఎంకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు ఇతరుల సహాయం తీసుకోరాదు. బ్యాంకు సిబ్బంది, ఏటీఎం సెక్యూరిటీ సహాయం తీసుకోవడం మంచిది అంటున్నారు పోలీసులు. ఇతరులకు మీ ఏటీఎం పిన్‌ నంబర్‌ చెప్పవద్దు. బ్యాంకు అధికారులమని మీ నంబర్‌కు ఎవ్వరి నుంచి ఫోన్‌ వచ్చినా నమ్మకండి. మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్‌ ఎవ్వరికి చెప్పకండి. ఎవరికైనా చెప్పారో కొన్ని క్షణాల్లోనే అకౌంట్‌లో డబ్బులు డ్రా చేసుకుంటారు. 

 ఈ మెయిల్స్‌, మెసెజ్‌లపై.. 

బ్యాంకులోని సొమ్ముని భద్రంగా ఉంచుకోవడం చాలామంచిది. అపరిచిత మెయిల్‌, ఫోన్‌కాల్స్‌, మేసేజ్‌ ద్వారా మీరు లక్కీడ్రాలో నగదు బహుమతి, విలువైన వస్తువులు గెలుపొందారని చెబుతుంటారు. అట్టి నగదు, విలువైన వస్తువులు పొందాలంటే ట్రాన్స్‌ఫర్‌ ఖర్చులకు కొంత నగదును మా ఖాతా నంబర్‌కు డిపాజిట్‌ చేయాలని నమ్మిస్తారు. అలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి.


logo