శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 17:51:43

స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ ఇదే నేటి ప్రపంచ మంత్రం : కేటీఆర్‌

స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ ఇదే నేటి ప్రపంచ మంత్రం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : నైపుణ్యం సాధించడం.. సాధించిన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం... తిరిగి నూతన నైపుణ్యాలను సంపాదించడం.. ఇదే నేటి ప్రపంచ మంత్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంత్రి ట్విట్టర్‌లో నేడు ఆస్క్‌ కేటీఆర్‌ సెషన్‌ను నిర్వహించారు. పెట్టుబడులు, పరీక్షలు, ఉద్యోగాల కల్పన, కోవిడ్‌, బిపాస్‌ ఇలా వివిధ అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ... స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ ఇదే నేటి ప్రపంచ మంత్రం అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించాలన్నారు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్నారు. టీఎస్‌ బీపాస్‌ అనేది గేమ్‌ ఛేంజర్‌ అని పట్టణ సంస్కరణల్లో అది బెంచ్‌ మార్క్‌గా నిలిచిపోతుందన్నారు. త్వరలోనే దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అప్పుడు ఇంటి నిర్మాణం విషయంలో అనుమతుల సమస్యలు తీరుతాయన్నారు. 

ప్రపంచంలోనే అత్యధిక సీసీ టీవీ కెమెరాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలవడం గర్వకారణమన్నారు. రాబోయే రోజులో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపారు. పౌరుల రక్షణకు, నేరాల తగ్గింపునకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రాష్ర్టానికి భారీ పెట్టుబడులు రానున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై ప్రకటనలు చేయనున్నట్లు వెల్లడించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తిస్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఏడాదిలో టీ ఫైబర్‌ పనులు పూర్తవుతాయని తెలిపారు.

  యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అతిపెద్ద మార్గదర్శి అన్నారు. వైద్యరంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ఆ అవసరాన్ని స్పష్టంగా గుర్తుచేసిందన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి రెండు ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపిన కేటీఆర్‌ మరిన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. ప్రస్తుతం రోజుకు 23 వేల కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఉత్తమ సేవలను అందిస్తున్నాయన్నారు. ప్రజలు ఇది గ్రహించాల్సిందిగా కోరుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు తమ సేవలను అందిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు తీసుకోని కేసులను సైతం ప్రభుత్వ వైద్యులు చూస్తున్నారన్నారు. ప్రభుత్వరంగ నిపుణుల కృషిని దయచేసి గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


logo