హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): చదివిన చదువుకు.. చేస్తున్న కొలువులకు ఏ మాత్రం పొంతన ఉండటంలేదు. విద్యతోపాటు, కాసింత విషయపరిజ్ఞానం, స్కిల్స్ ఉండటం కొలువుల సాధనకు ఉపకరిస్తాయి. దీనిని గుర్తించిన తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడాలేకుండా ఇంటర్ కాలేజీలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చి 40 రకాల కోర్సులను నిర్వహిసున్నది. ఈ ఏడాది బ్లాక్‌చైన్, ఫ్లోరీకల్చర్లాంటి 10 రకాల కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణనిప్పించనున్నది.
ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా రెగ్యులర్ కోర్సులతో పాటు, వొకేషనల్ కోర్సులను సైతం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (ఎస్ఐవీఈ)ను ఏర్పాటుచేసి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతోపాటు, స్వచ్చంద సంస్థలు, ఎన్జీవోలకుసైతం గుర్తింపునిస్తున్నారు. 3, 6, 9 మాసాల వ్యవధి గల కోర్సులను వీటిద్వారా నిర్వహిస్తున్నారు. రూ.600 నుంచి రూ. 1800 ఫీజు వసూలు చేస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన కోర్సుల నిర్వహణను అధికారులు తాజాగా చేపట్టారు. కొత్తగా ప్రవేశాలతోపాటు ఆన్లైన్లో తరగతులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీచేశారు. ఈ వొకేషనల్ కోర్సుల మూడోవిడుత శిక్షణ మార్చి 1 నుంచి ఏప్రిల్ 31వరకు ఉంటుంది. మార్చి 15 వరకు ప్రవేశాలకు గడువుగా విధించగా, జూన్ 1న ఇంటర్నల్స్ ఎగ్జామ్స్‌ను, జూన్ 4,5 తేదీల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
స్పల్పకాలిక కోర్సుల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యామండలి అప్లియేషన్లు ఇవ్వనున్నది. ఆసక్తిగల వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీలు, ఎన్జీవోలు, సొసైటీలు, సహకార సంస్థల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యామండలి కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. గరిష్ఠంగా 9 , కనిష్ఠంగా 2 కోర్సులకు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. మార్చి 15లోగా దరఖాస్తు చేసిన వారికి గుర్తింపును జారీచేసి, కోర్సుల నిర్వహణను చేపట్టనున్నట్టు వెల్లడించారు. వివరాల కోసం www. sive.telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇంజినీరింగ్ సెక్టార్: బేసిక్ ఆటోమోటివ్ సర్వీసింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ వెల్డింగ్, క్యాడ్ ఆపరేటర్, బేసిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్, జూనియర్ ల్యాండ్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ఇన్స్పెక్టర్, వర్క్ సూపర్వైజర్, సీనియర్ లాండ్ సర్వేయర్.
పారామెడికల్ సెక్టార్: డెంటల్ సిరామిక్, అప్టిమెట్రిస్టిస్ట్, ఫార్మసీ, డయాలసిస్ అసిస్టెంట్లు, బేసిక్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మిడ్వైఫ్రీ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: కంప్యూటర్ ఫండమెంటల్స్ (ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్), డెస్క్‌టాప్ పబ్లిషింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, వెబ్‌డిజైనింగ్.
కామర్స్ అండ్ రిటైల్ రంగం: సెల్‌ఫోన్ టెక్నాలజీ, రిటైల్ ఆపరేషన్స్. అకౌంటింగ్ ప్యాకేజీ (ట్యాలీ), లీగల్ అసిస్టెంట్, ట్యాక్సేషన్, ఆఫీస్ మేనేజ్మెంట్.
హోంసైన్స్ రంగం: కంప్యూటర్ బేస్డ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్, గార్మెంట్స్ మేకింగ్, హాస్పిటాలిటీ అసిస్టెంట్
డెయిరీ సెక్టార్: డెయిరీ ఫార్మింగ్, డెయిరీ వర్కర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ సర్వీసెస్, తోటమాలి.