గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 16:57:30

ముత్తారంలో ఆరు పెద్ద పులులు!.. దాడిలో ఆవు మృతి

ముత్తారంలో ఆరు పెద్ద పులులు!.. దాడిలో ఆవు మృతి

పెద్దపల్లి : ముత్తారం మండలం మచ్చుపేట అడవుల్లో ఆరు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఒకేసారి ఆరు పెద్ద పులులు పశువుల మందపై దాడి చేయగా.. ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి, పశువుల కాపరి రాజయ్య తెలిపాడు. మచ్చుపేటకు చెందిన రాజయ్య ఆవుల మందను బహులగుట్టకు మేతకు కొట్టుకు వెళ్లగా.. 9గంటల ప్రాంతంలో ఆరు పులులు ఆవుల మందపై దాడి చేశాయని, కేకలు వేయడంతో ఒక ఆవును చంపి పారిపోయాయని పేర్కొన్నాడు. రాజయ్య కేకలు విని చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నరసింహరావు, అటవీశాఖ అధికారులతో కలిసి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి చనిపోయిన ఆవును గుర్తించడంతో పాటు పశువుల కాపరి ఆచూకీ కోసం గాలించారు. ఘటనకు సంబంధించి రాజయ్య నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు సమాచారం సేకరించారు. పులులు అటవీప్రాంతంలోనే ఉన్నాయని ఫారెస్ట్‌ అధికారులు పేర్కొన్నారు. రాజయ్యను గ్రామానికి తీసుకువచ్చారు. పోలీస్‌, ఫారెస్ట్‌ అధికారుల వెంట ఎంపీపీ జక్కుల ముత్తయ్య, సర్పంచులు సతీశ్‌గౌడ్‌, సదానందం సంపత్‌రావు ఉన్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo